Nov 26,2021 07:46

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించేందుకు సిద్ధంగా ఉన్నారా? అరటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు) ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు విచారించింది. ''కేసుల్లో శిక్ష పడిన వ్యక్తి గుమాస్తా కాలేడు, కానీ మంత్రి కాగలడు'' అని ఉపాధ్యాయ కోర్టుకు తెలిపారు. శిక్షపడిన నేతలపై జీవితకాల నిషేధం విధించాలని కోరారు. ఇక ఈ అంశంపై ప్రభుత్వ అభిప్రాయం ఏమిటని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజును ప్రశ్నించారు. ''ఎన్నికలలో పోటీ చేయకుండా దోషులుగా తేలిన రాజకీయ నాయకులను నిషేధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?'' అని సీజేఐ ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తప్ప చట్టాన్ని రూపొందించడం లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం కుదరదని ధర్మాసనం పేర్కొంది.