Jan 25,2022 22:10

ధర్నాలో పాల్గొన్న నాయకులు, దళితులు

ప్రజాశక్తి - హిందూపురం : డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని కొటిపి సచివాలయం దగ్గర కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో దళితులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి రమణ మాట్లాడుతూ హిందూపురం మండలం కోటిపి గ్రామంలో డప్పు కళాకారులు 15 మంది గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ గుర్తింపు కార్డులకు సంబంధించి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ సంతకాలు చేయకుండా వివక్ష చూపుతూ దళితులకు అన్యాయం చేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. పై అధికారుల నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు లేవని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 119 జీవో ప్రకారం గ్రామాల్లో పట్టణాల్లో డప్పు కొట్టే ప్రతి కళాకారునికి గుర్తింపు కార్డు, పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులను ఆర్థికంగా సామాజికంగా అణగదొక్కుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దళితులకు వర్తించకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈవిషయంపై ఉన్నతాధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని బాధ్యుడైన వెల్పేర్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాము, నాగరాజు, గంగప్ప, తిమ్మయ్య, రామప్ప, మాజీ సర్పంచి రామంజి, నరసింహులు, సంజీవప్ప తదితరులు పాల్గొన్నారు.