Oct 28,2021 06:57

అనేక సంవత్సరాలుగా, విద్వేషపూరిత ప్రసంగాల ద్వారా జరిగే హత్యలు వారిని సంతృప్తిపరచలేక పోయాయి. అందుకే పోలీసులచే కాల్చి చంపబడిన రైతు మృతదేహంపై ఒక ఫొటోగ్రాఫర్‌ గంతులు వేయడాన్ని చూడాల్సి వచ్చింది. అసోంలో, ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపి శక్తులు తమ మద్దతుదార్ల మెదళ్ళలో ఏ విధమైన రాజకీయ ద్వేష భావాలను పథకం ప్రకారం జొప్పించడానికి ప్రయత్నించాయో ఈ ఘటన తెలియజేస్తోంది. పోలీసు కాల్పుల్లో చనిపోయాక కూడా, అతని శరీరంపై లాఠీల వర్షం ఆగలేదు. విచక్షణతో, లోతుగా ఆలోచించే వారిని ఈ ఘోర సంఘటన కుదిపివేసింది. భారతదేశం లోనే కాక విదేశాలలో కూడా బహిరంగ నిరసనలకు దారితీసింది.
హేమంత్‌ బిస్వా శర్మ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం అక్రమ ఆక్రమణల పేరుతో రైతులను వారి భూముల నుండి వెళ్ళగొట్టి, నిరాశ్రయులను చేయటానికి ఉత్సాహ పడుతున్నది. దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతులను నిరాశ్రయులను చేయటానికి బలగాలను ప్రయోగిస్తున్నది. ఈ సమస్యకు సంబంధించి గౌహతి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రైతులకు ముందుగా కనీసం తగిన నోటీసు కూడా ఇవ్వకుండా, ఖాళీ చేయించే ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం కల్పించిన అందరికీ సమానత్వం, భద్రత అనే హామీలు దారుణంగా ఉల్లంఘించబడ్డాయి. 77 వేల బిఘాలలో (1 బిఘా=14,400 చదరపు అడుగులు) సహకార వ్యవసాయాన్ని ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దానివల్ల స్థానిక యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం నమ్మబలుకు తున్నది. పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేస్తూ కుయుక్తులతో, ప్రజలను సామాజికంగా విడదీయడానికి, చిన్న రైతులను భూమి నుండి ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నది.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు డా|| శివదాసన్‌, అఖిల భారత న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు బికాస్‌ రంజన్‌ భట్టాచార్య, అసోం క్రిషక్‌ సభ అధ్యక్షులు గజన్‌ బర్మన్‌, కోశాధికారి మసద్దర్‌ హుస్సేన్‌, ఎ.ఆర్‌ సిక్తర్‌, అసోం ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ కార్యదర్శి, ఇతరులు ఒక బృందంగా, అసోం లోని దరాంగ్‌ జిల్లా సిపాజర్‌ ప్రాంతానికి చెందిన ఈ ధల్‌పూర్‌-గోరుఖుటిని సందర్శించాం. మేం ఆ ప్రాంతానికి చేరుకోవడానికి అనువైన రహదారులన్నీ పోలీసుల రక్షణ వలయంలో ఉన్నందున జలమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది.
అక్కడ వేలాది మంది ప్రజలు నివాసయోగ్యంకాని ప్రదేశాల్లో నివసించవలసి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ క్రూరమైన దాడులను, నిర్బంధాలను ఎదుర్కొనగలిగే ఎలాంటి ఏర్పాట్లు లేవు! మహమ్మారి సమయంలో పారిశుధ్యం, ఆరోగ్య సౌకర్యాలు తగినంతగా లేకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు పెరిగాయి. బిజెపి ప్రభుత్వ ఉదాసీనత, దీనితోపాటు 'మియా' (ముస్లింల) ఓట్లు తనకు అవసరంలేదని ముఖ్యమంత్రి నిరంతరం చేసే ప్రకటనలు వీరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, ఆ ప్రాంతంలోని రైతాంగాన్ని ఖాళీ చేయించడాన్ని సమర్థించుకున్నారు. 4500 భిగాలను ఖాళీ చేయించి, స్వేచ్ఛ కలిగించినందుకు 800 గృహ సముదాయాలను తొలగించినందుకు, అక్రమంగా నిర్మించిన మతపరమైన నిర్మాణాలను, ఒక ప్రయివేటు సంస్థను కూల్చినందుకు...జిల్లా యంత్రాంగానికి, అసోం పోలీసులకు అభినందనలు తెలిపారు. పునరావాసం, పునరావాస ప్రణాళిక విషయంలో పరస్పర అంగీకారం లేకుండా, వేల మంది ప్రజలు బలవంతంగా తొలగిస్తూంటే, ప్రజలెన్నుకున్న ప్రతినిధి ఇలా ఎలా చేయగలుగుతున్నాడు!?
అక్రమ వలసదారులనే నెపంతో, సొంత ప్రదేశాల నుండి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అంతేగాక ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టించి, ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని పురికొల్పి రాష్ట్రాన్ని మతపరంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నివసిస్తూ, జీవనోపాధి పొందుతున్న దాదాపు 1170 కుటుంబాల వారిని ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేయించారు. భూమి కోత వల్ల దిగువ అసోం నుండి... ప్రధానంగా బార్పేట, కామరూప్‌ జిల్లాల నుండి...అనేకమంది ఈ ప్రాంతానికి వలస వచ్చారని నివేదికలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మపుత్రా నది వరదల కారణంగా ఎక్కువ మంది పేద రైతాంగ కుటుంబాలవారు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇదంతా నదీ పరీవాహక ప్రాంతం. అనేక వేలమంది వివిధ రకాల నిబంధనలకు లోబడి ఐదు దశాబ్దాలుగా ఇక్కడ భూమిని సాగు చేస్తున్నారు. ఇఖోనా (వార్షిక వ్యవసాయ హక్కులు లేక ఫైన్‌ చెల్లిస్తూ పొందే నియమిత కాల పట్టా), తౌజి (ఫైన్‌ కడుతూ కొనసాగుతున్న ప్రక్రియతో శాశ్వత పట్టా పొందే పద్ధతి), మయాది (తగిన భూమి పత్రాలు కలిగివుండడం) వంటి పాక్షిక చట్టపరమైన ఏర్పాట్లతో చిన్న వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, మత్స్యకారులు, చేతి వృత్తిదారులు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుని పూర్తి సామరస్యంతో మనుగడ సాగిస్తున్నారు. అసోంకు సంబంధించిన నివేదికల ప్రకారం ప్రధానంగా ఛార్‌ (నదీ ప్రాంత దీవులు) ప్రాంతంలో 35 లక్షల మంది ముస్లిం ప్రజలు నివసిస్తారని నివేదిక తెలియజేస్తున్నది. పైన తెలిపిన విధంగా చట్టపరమైన ఏర్పాట్లతో లక్షల మంది నదీ పరీవాహక ప్రాంతానికి వెలుపల ప్రభుత్వ భూములలో గానీ, అడవులలో గానీ నివసిస్తున్నారు.
అయినల్‌ హక్‌ (50 సంవత్సరాలు) అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ, అక్కడే చదువుకున్నాడు. తమను అక్రమ ఆక్రమణదారులుగా, చట్టవ్యతిరేకమైన బంగ్లాదేశ్‌ వాసులుగా ముద్ర వేస్తున్నారని అక్కడ నెలకొన్న పరిస్థితులను విలపిస్తూ తెలియజేశాడు. సాయుధ పోలీసులు స్థానిక ఆందోళనకారులపై హింసాత్మకంగా వ్యవహరించడమేకాక, నడుము పైభాగంలో కాల్పులు జరుపుతూ చంపేందుకు ప్రయత్నించారు. చనిపోయినవారికి, గాయపడిన వారికి గాయాలు నడుము పైభాగంలోనే ఉన్నాయి. కొందరు బాధితులకు పొట్టపై, ఛాతీపై, భుజాలపై బుల్లెట్‌ గాయాలు ఉన్నాయి. పోలీసు దాడిలో విరిగిన తన చేతిని 12 సంవత్సరాల బాలిక హస్నాబా చూపించింది. గడ్డి బీడులో పశువులను మేపుతూ జీవించే 26 సంవత్సరాల సద్దామ్‌ కు ఛాతీ కింద బుల్లెట్‌ గాయం వుంది. 13 సంవత్సరాల అష్రాఫుల్‌, బుల్లెట్లతో ఏర్పడిన రెండు గాయాలను, వాచిన భుజాలను మా బృందానికి చూయించాడు. చనిపోయిన వారి కుటుంబాలకు, అఖిల భారత కిసాన్‌సభ తరఫున ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేశాం. ఆలిండియా న్యాయవాదుల యూనియన్‌ కూడా తన వంతు సహాయం చేసింది.
బెలియా గార్డ్‌ ప్రజలు తమ నివాస స్థలాల నుండి బలవంతంగా బయటకు నెట్టివేయబడ్డారు. అసోం పోలీసు బలగాలు వారి భూములను వ్యవసాయానికి పనికిరాకుండా చేశాయి. పంటలను, చెట్లను కూడా మినహాయించలేదు. ఈ విధ్వంసంలో భాగంగా ప్రజల నివాసాలు కూడా కూల్చివేయబడ్డాయి. తమ ఇళ్లను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడాన్ని ప్రజలు నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వారి వాహనాలు, నీటి పంపులను తగలబెట్టారు. ఆహార ధాన్యాలను కూడా నాశనం చేశారు. ప్రజలు నీటిని తోడుకునే వీలు లేకుండా, గొట్టపు బావులను కూడా పెకిలించి వేశారు. తాము 1975 నుండి ఆ ప్రాంతంలో నివసిస్తున్నామని, ముందుగా తగిన నోటీసులు కూడా ఇవ్వలేదని, తమ వస్తువులను సేకరించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని, పునరావాసానికి, స్థిర నివాసానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా బలవంతంగా నివాసాలను వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారని అమీర్‌ షేక్‌ అనే వృద్ధుడు తెలిపారు. ఎలాంటి అనుమానం లేకుండా 50 సంవత్సరాల నుండి, భారతదేశ పౌరునిగా ఆ ప్రదేశంలో నివసిస్తున్నామని, ఖాళీ చేయించబడిన ప్రజల వద్ద, భూమి దస్తావేజులు, ఆధార్‌ కార్డులు, ట్రెజరీలో చెల్లించిన రసీదులు, రేషన్‌ కార్డులు ఉన్నాయని చెప్పారు. తాము అక్రమ వలసదారులమైతే, 38 అంగన్‌వాడీ కేంద్రాలను, 42 సర్వశిక్ష లోయర్‌ ప్రాథమిక పాఠశాలలను, హైస్కూళ్లను, 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రెండు ఉప కేంద్రాలను ప్రభుత్వాలు తమ కోసం ఏ విధంగా ఏర్పాటు చేశాయని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో అన్ని పాఠశాలల్లో అస్సామీ బోధనా భాషగా ఎలా ఉన్నదని ప్రశ్నించారు.
ప్రజలను ఖాళీ చేయించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ట్రాక్టర్లతో దున్నించారు. వారు అక్కడికి తిరిగి రాకుండా రహదారులను మూసివేశారు. అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవతా దృష్టి లేదు. రైతులను అక్రమ వలసదారులన్న ముద్ర వేయకుండా అడ్డుకోవడం లోను, పరస్పర అంగీకారం ప్రకారం స్థిర నివాసం, పునరావాసంతో వారికి జీవనోపాధిని పొందే అవకాశం కల్పించడం లోను, వ్యవసాయ యోగ్యమైన భూమిని సమకూర్చడం లోను ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. వారు ఆ ప్రాంతంలో నివసించడానికి గత కాంగ్రెస్‌, అసోం గణపరిషత్‌ ప్రభుత్వాలు అనుమతినిచ్చినప్పటికీ, భూమి యాజమాన్య హక్కును గాని, గృహ వసతినిగాని కల్పించలేదు. ఈ లోపాన్ని బిజెపి ప్రభుత్వం అవకాశంగా తీసుకొని, తమ స్పష్టమైన ప్రణాళికతో వారిపై వేటు వేయడానికి ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాంతంలో మతపరమైన విభజనకు సైతం ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యేకంగా, ముస్లిం రైతాంగం సాగు చేస్తున్న భూములే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇతర ప్రాంతాలలో గిరిజన ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఇది రైతుల భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించడానికి పన్నిన కుట్రలో భాగమే.
ప్రజాస్వామ్య శక్తుల సత్వర కర్తవ్యం ఏమిటంటే, రైతుల పక్షాన నిలబడి వారిని కష్టాలలో ఆదుకోవడంతోపాటు ఉపశమనం కల్పించాల్సి ఉంది. ద్వేషంతో కూడిన రాజకీయాలను అనుమతించబోమని బలమైన, స్పష్టమైన సందేశాన్ని పంపవలసి ఉంది. తమ సొంత భూమి నుండి వెళ్ళగొట్టబడి, నిరాశ్రయులైన వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. దరాంగ్‌ ప్రాంత ప్రజలు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించిన సాంప్రదాయం కలవారు. 1894లో పోధోర్‌ ఘాట్‌ వద్ద భూమి శిస్తు పెంపునకు వ్యతిరేకంగా నిరాయుధులైన 140 మంది రైతులు ప్రాణాలర్పించిన చరిత్ర దరాంగ్‌ ప్రజలకు ఉంది. ఆ రైతాంగం యొక్క భూమి హక్కును కాపాడడానికి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వుంది.
                                        విజూ కృష్ణన్    -  / వ్యాసకర్త : ఎ.ఐ.కె.ఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి /   

                                                  దరాంగ్‌ ప్రజల వారసత్వాన్ని కొనసాగిద్దాం