May 26,2023 23:44

ప్రజాశక్తి-అమలాపురం డ్రగ్స్‌ వల్ల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, డిఆర్‌ఒ సత్తిబాబు, ఆర్‌డిఒ వసంతరాయుడు, ఎఎస్‌పి ఖాదర్‌ బాషా, ఐసిడిఎస్‌ పీడీ సత్యవాణి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎస్‌పి శ్రీధర్‌ గత నెల నుంచి ఇప్పటివరకు డ్రగ్స్‌ వినియోగం, రవాణాను నిర్మూలించడానికి తీసుకున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. జిల్లాలో నాలుగు కేసులు రిపోర్టయ్యాయని ఈ కేసులకు సంబంధించి 19 మందిని అరెస్టు చేశారని తెలిపారు. జిల్లాలో ఎన్‌డిపిఎస్‌ చట్టం కింద 134 మందిపై కేసులు నమోదు చేశారని వీరిలో 124 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 1,120 కేజీల గంజాయిని, రూ.25 లక్షల విలువైన 8 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి రెండు నేషనల్‌ హైవేస్‌లో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్‌టిఎ అధికారులు చెక్‌ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. స్కూల్స్‌, కాలేజీల్లో డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.