May 14,2022 06:50

ప్రిల్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.79కి ఎగబాకడం ఆందోళన కలిగించే పరిణామం. చిల్లర ద్రవ్యోల్బణం ఇంత రికార్డు స్థాయికి పెరగడానికి ప్రధాన కారణం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కేంద్రం తెరపి ఇవ్వకుండా పెంచుతూపోవడం, ఆహార ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయకపోవడమే. తీవ్రమైన ధరాఘాతంతో విలవిల్లాడుతున్న ప్రజలపై మరిన్ని భారాలు పడుతుండటం బాధాకరం. కోవిడ్‌ విపత్తులోనూ ప్రజలపై ఎనలేని పన్నుల భారాలు మోపిన మోడీ సర్కార్‌ ద్రవ్యోల్బణం పెంచుతోంది. ఆహార ఉత్పత్తుల విచ్చలవిడి దిగుమతులకు అనుమతులివ్వడంతో పాటు బడా కార్పొరేట్‌ కంపెనీలు భారీగా అక్రమంగా నిత్యావసరాలను నిల్వ చేస్తున్నా పట్టించుకోకపోవడం మరోవైపు ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ను ప్రోత్సహించడం వల్లే అటు ఆహార ద్రవ్యోల్బణం రంకెలు వేయడానికి దారితీస్తోంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగానే ధరలు పెరుగుతున్నాయన్నది కేంద్రం వాదన. రెండేళ్ల కిందట లీటరు వంట నూనె ధర రూ.70గా ఉండేది. అదిప్పుడు రూ.200కు పైబడింది. సరుకు కూడా తగినంత అందుబాటులో ఉండటం లేదు. దీనంతటికీ ఉక్రెయిన్‌ యుద్ధాన్నే బూచిగా చూపిస్తున్నారు. వంట నూనెలతో పాటు మిగిలిన అన్ని వస్తువుల ధరలూ నింగినంటుతున్నాయి. వంట నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎగబాకినందునే 2022 ఏప్రిల్‌ చిల్లర ద్రవ్యోల్బణం 7.79కి చేరిందన్నది విశ్లేషకులంటున్న మాట. 2014 మే నెలలో నమోదైన అత్యధిక చిల్లర ద్రవ్యోల్బణం 8.33 తర్వాత గరిష్ట రికార్డు ఇదే. ధరాఘాతానికి ముకుతాడు వేయాలంటూ రిజర్వుబ్యాంకు ద్రవ్య పరపతి కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి గతవారమే రెపోరేటును 40 బేసిక్‌ పాయింట్లు పెంచింది. దీనిని మరింత పెంచవచ్చునని ఆర్థికవేత్తలంటున్నారు. అంటే బ్యాంకు రుణాలతో.. నెలవారీ పద్దులతో.. జీవితాలను నెట్టుకొస్తున్న వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలపై మరిన్ని భారాలు మోపడమే. కానీ ధరాఘాత అసలు ముద్దాయి అయిన కేంద్ర ప్రభుత్వానికే ఈ దిశగా కాస్తయినా సోయి లేకపోవడం సిగ్గుచేటు. పెట్రోలు ధరలను పదేపదే పెంచడమే గాక ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణమని, స్థానిక పన్నులు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదురుదాడికి తెగించడం దారుణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు దక్కనీయకుండా సెస్‌లు బాదేసి దొడ్డిదారిన ఖజానా నింపుకున్నది కేంద్రమే. ఇలా నేరుగా భారాలు దట్టించడంతో పాటు విద్యుత్‌, రవాణా, విద్య, పురపాలక రంగాల్లో వినాశకర సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం మోడీ సర్కార్‌ చేసిన మరో దుర్మార్గం. దాంతో ప్రజలపై భారాలు ఇంకా పెరుగుతున్నాయి.
       ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరోవైపు పడిపోతున్న నిజ వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చితికిపోతున్నా చిన్న చూపే చూసింది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే కుటీర రంగం ఇప్పటికీ కోలుకునే పరిస్థితి లేదు. గ్రామీణ ఉపాధికి నిధులు తెగ్గోస్తూ ఆ చట్టాన్నే అటకెక్కేంచే కుతంత్రాన్ని మోడీ సర్కార్‌ కొనసాగిస్తోంది. రివర్స్‌ మైగ్రేషన్‌తో ఇంటిముఖం పట్టిన గ్రామీణ భారతావని ఉపాధి లేక ఈసురోమంటోంది. తయారీ రంగం కోలుకోవాలంటే ప్రజల కొనగోలు శక్తి పెరగాలి. ఉపాధి కల్పనే దానికి మార్గం. ఇప్పటికైనా మోడీ సర్కార్‌ దిగొచ్చి ధరాఘాతానికి కారణమైన పెట్రో ఉత్పత్తుల ధరలను తక్షణమే తగ్గించాలి. వినాశకర సంస్కరణలను విడనాడాలి.