Oct 05,2022 06:37
  • పండగంటే పదిమంది కూడడం. ఆ కూడిన వాళ్లు ఆడిపాడడం .. లేదా ఆటపాటలను ఆస్వాదిస్తూ ఆనందంగా పరవశించటం. పేర్లు, తీర్లూ వేర్వేరు కావొచ్చు గానీ, మన అన్ని పండగల పరమార్థం ఇదే! దసరా అంటేనే సరదాల పండగ అని చాలామంది చెబుతారు. దసరాలోనే సరదా దాగి ఉంది కదా అని తమాషా చేస్తారు. మనం ఏ పండగను తలచుకున్నా గతంలోకి పున:ప్రవేశం చేస్తాం. ఆ పండగలు మొదలైనప్పుడు వాటి మూలాలూ, బలాలూ ... ఒకప్పటి పల్లెల్లో ఎలా ఉండేవో తలపోసుకుంటాం. అదీ, ఊళ్లకు, ఉత్సవాలకు ఉన్న అవినాభావ సంబంధం. రండి .. ఒకప్పటి మన ఊరి దసరా సరదాలను అనేక దృశ్యాలుగా వీక్షిద్దాం.

ఏ పండగైనా పండగ రోజే రాదు. అంతకుముందు నుంచే నెమ్మది నెమ్మదిగా మొదలవుతుంది. పండగరోజున పతాక స్థాయికి చేరి, ఆ తరువాత జ్ఞాపకాల్లోకి ఇంకిపోతుంది.. అంతే! పండగ తొలుత పిల్లల్లోకి, తరువాత మహిళల్లోకి ప్రవహిస్తుంది. ''దసరా వస్తోంది. గిలకలు సిద్ధం చేయాలి. దసరా వస్తోంది బొమ్మల కొలువుకు సన్నద్ధం కావాలి. దసరా వచ్చేస్తోంది. కొత్త బట్టలు కుట్టించాలి. దసరా దగ్గర పడుతోంది. ఇల్లంతా శుభ్రం చేయాలి. ఎల్లుండే దసరా. ఫలానా ఫలానా పిండివంటలు చేయాలి.''
... ఇదిగో ఇలాంటి ఇంపైన మాటలతో ప్రారంభమవుతుంది పండగ. పిల్లల ముఖాలు ఆనందంతో వెలుగుతాయి. అమ్మల పనులు పరమానందంతో సాగుతాయి. ఏటిపక్క గట్టు మీది వెదురువనంలో ఒక పొడవాటి గడ నేలకొరుగుతుంది. కమ్మరశాలలోకి వచ్చి చేరుతుంది. బద్దలు బద్దలుగా చీల్చటం, బాణాలు మాదిరిగా మార్చటం, గిలకలకు రంగురంగు కాగితాలు సమకూర్చటం, మైదా పిండితో బుట్టలు అమర్చటం, అవి ఆరేదాకా ఆత్రంగా ఎదురుచూడడం ... ఆ సందర్భాల అన్నిటా పిల్లలకు క్షణక్షణమూ సంబరమే! కొత్త బట్టలు తీయటం, కొలతలు ఇవ్వడం, బడికి వెళుతూ వస్తూ టైలరు షాపులోకి తొంగి చూడడం; గుడ్డ కత్తిరించాడని, చేతులు కుట్టాడని, కాజాలు వేస్తున్నారని, బొత్తాయిలు కుడుతున్నారని ... పిల్లకాయలు పదే పదే చెప్పుకోవడం గొప్ప సరదా!

dasara jeevana story by satyaji
  • ఊళ్లో వీధి వీధినా ఏదో సందడి. కళాకారుల వాయిద్యాల దరువు .. పాటల మోత. ఒక వీధిలో కొమ్మ దాసరి సందడి. ఇంకో వీధిలో పగటివేషపు హడావిడి. పై వీధిలో జంగమ దేవర గంటానాదం. పక్క వీధిలో బుడబుక్కల శబ్ద వినోదం. ఆ సందళ్ల వెనుక గుంపు గుంపులుగా పిల్ల జనం. వీధివొంపులో ముసలీ ముతకా గుమిగూడిన సందోహం..
  • ఊరు ఊరంతటికీ ఒకే వ్యాపకం. వినోదానికి వీధి కళాకారులే ప్రధాన కారకం. ఎక్కడికక్కడ ఎక్కువ సేపు ఆడాలని, పాడాలని ఆదరంగా జనం అడగటం.. కళాకారులకు ఎంతో గౌరవం! వెయ్యేనుగుల కళాబలం! మైకుల్లేవు .. మౌతుల్లేవు. అంతా శుద్ధ రాగాల కంఠానాదం! అబ్బా .. ఏమి గొంతు .. కంచు కంఠం! మెచ్చుకోళ్లూ, ఎంతో కొంత ఇచ్చుకోళ్లూ .. జానపదం మెడలో వేవేల వీరతాళ్లు!

***************************

జానపద కళాకారులకు అత్యంత ఆదరణ ఉన్న కాలం. ప్రజలు ప్రేమారా స్వాగతించిన కాలం. పగటి వేషమో, పాట కచేరీనో, కొమ్మ దాసరో, చెంచు ఆసామో, ఈటి విద్యో, గారడీ తంతో ... ఏదైనా కావొచ్చు, ఎవరైనా అవ్వొచ్చు. ఎవరూ ఎప్పుడూ ఎక్కడా ... యాచకులు కారు. వినోదాన్నో, విజ్ఞానాన్నో పంచే ఆదరణీయమైన కళాకారులు. రైతు పంట పండించినట్టే వాళ్లు హాస్యాన్ని, ఆనందాన్ని పండించి, ఊరందరికీ వడ్డించేవారు. పల్లెజనం ఆత్మీయంగా ఆస్వాదించేవారు. కళాకారులు ఊరు ఇచ్చిన ధాన్యాన్ని, ప్రేమనీ తమతో తీసుకువెళ్లేవారు. ఎవరింట వాళ్లు, ఎవరి మానాన వాళ్లు పొద్దుపుచ్చే టీవీ, సెల్లుఫోనూ లేని కాలం. సందడి కావాలంటే నలుగురూ ఒకచోట చేరాల్సిందే! పండగ అర్థాన్ని, పరమార్థాన్ని ప్రత్యక్షంగా చవి చూడాల్సిందే!

  • అదిగో .. వీధిలో డప్పుల దరువు మొదలైంది.
  • పదండి.. పదండి .. పిల్లా పెద్దా ఆడామగా .. అందరూ!
dasara jeevana story by satyaji


దసరా తరుణంలోనే చాలా ఊళ్లలో గ్రామ దేవతల జాతరలు. గైరమ్మ సంబరాలు,నాదెన్న ఉత్సవాలు. జానపదాల సందోహాలు.. బండ్ల మీద రకరకాల వేషాలు .. సీతారాములు, ఆంజనేయుడు, బృహన్నల, రావణాసురుడు, గాంధీ, భగత్‌సింగూ, అల్లూరి సీతారామరాజూ ... ఒక్కో వేషం ఒక్కో సందేశం. చూసే వందలాదిమందికి వినోదం. వీధికి ఇరుపక్కలా కిక్కిరిసిన జనం. తల్లుల చంకల్లో, తండ్రుల భుజాల మీదా పిల్లలు. ఒక్కో బండి వేషం ..

వందలాది కబుర్లకు అవకాశం.

''సీతారామరాజు ఇలా ఉండీవాడా?''
''భగత్‌ సింగుది అంత సన్నటి మీసమా?''
''గాంధీ అసలు ఎప్పుడూ చొక్కా వేసుకోలేదా''
''రావణుడు అన్ని తలల్లో ఏ తలతో తినీవోడో,
ఏ నోటితో మాట్లాడీవోడో ...''

... ఇలా ప్రశ్నలో, సందేహాలో ఎవరి నోటినుంచో వెలువడుతూ ఉంటాయి. ఆ గుంపులోంచి ఎవరో ఒకరు సమాధానాలు చెబుతూ ఉంటారు. సమూహాలు అంతే! వాటికవే ఇలా ఉత్సవ సందోహాలు .. ఉమ్మడి ఊసుల ప్రవాహాలు ...
                                                                   ********************************
రానే వచ్చింది దసరా.
ఏ గుమ్మం ముందో బడిపిల్లల దసరా పాటల సందడి.
''ఏదయా మీ దయా మా మీద లేదు
ఇంత సేపుంచుట ఇది మీకు తగదూ ...
దసరాకు వస్తిమని విసవిసలు పడక ..
చేతిలో లేదనక ఇవ్వలేమనక
ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మీ
గొప్పగా చూడండి తప్పకా మీరు ...''

బాలల బృందగానం హోరెత్తి పోతూ ఉంటుంది. రంగు రంగుల కొత్త బట్టలు వేసుకొని.. సీతాకోకచిలుకల్లా ఝూమ్మని ఎచ్చటెచటికో ఎగురుతూ ... బడిపిల్లలు.. పరమానందంగా గిలకలు పట్టుకొని ఊరేగుతుంటే దానికదే గొప్ప సంబరం. వీధివీధంతా పాటల పరిమళం. బంతిపూల రెమ్మలూ, తులసీ మారేడు పత్రీ సంచుల్లో కుక్కుకొని, ఎప్పటికప్పుడు గిలకల బుట్టల్లో సర్దుకొని .. 'జయీభవ .. దిగ్విజయీభవ' అంటూ వింటినారిని వెనక్కి లాగి .. గుమ్మాల్లోకి గురి చూసి కొడితే ..
ఇల్లంతా పత్రీ పరిమళం.
పూలరెమ్మల వర్ణ సోయగం.

dasara jeevana story by satyaji
  • దసరా ఊరికొక తీరు.. కథలూ అనేకాలు.

కాలం చాలా మారింది. ఊళ్లూ బాగా మారిపోయాయి. ప్రపంచీకరణ ప్రవేశించి పల్లెలూ పట్టణాలు అన్నింటినీ ఏకం చేసింది. టీవీలొచ్చాయి. స్మార్టుఫోన్లొచ్చాయి.ప్రపంచం మొత్తాన్ని కళ్ల ముందుకు తెచ్చాయి. పైన చూసిిన దృశ్యాలన్నీ అదృశ్యాలయ్యాయి. జానపదాలు ఆదరణ కోల్పోయాయి. ఇప్పుడు పండగలు.. మూలాలు తెగిన గాలిపటాల్లాంటివి. బోలెడు ఖర్చు పెడుతున్నారు. బోలెడు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, చూట్టానికి, మాట్లాడుకోవటానికి జనమే కరువు! సందడి, హడావిడి ఉన్నట్టు కనిపిస్తున్నా - విడివిడిగా ఎవరి ప్రపంచం వారిది! ఇప్పుడు పండగ తొలుత ప్రవహిస్తున్నది పిల్లల నుంచో, తల్లుల నుంచో కాదు; వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి. వారి రకరకాల ఫెస్టివల్‌ ఆఫర్ల ధమాకా నుంచి. ఇప్పుడు కొత్తగా పండగల్లోకి మతమౌఢ్యం కూడా ప్రవేశిస్తోంది. సందళ్ల స్థానే చాదస్తం పెరుగుతోంది. అలాంటి వాటిని దూరంగా నెట్టాలి.
పండగంటే వ్యాపారమో, రాజకీయ వ్యవహారమో కాకూడదు. పండగంటే పదిమంది కలయిక. ఉమ్మడితనాల కలబోత. పాడిపంటలు పొంగిపొర్లి, పల్లెసీమలు బాగుపడి, మన ఊళ్లు ఉపాధీ ఉద్యోగాలకు బతుకు గూళ్లు కావాలి. ఉరుకుల పరుకుల ఉరవడి నుంచి బయటపడి, కొత్త ఒరవడికి అడుగులు వేయాలి. కాలం ఎప్పుడూ ముందుకే పోతుంది. పాతవి తలపోతకే తప్ప- తవ్వితీతకు కాదు. సందళ్లకు సరదాలకు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ మనుషులే మూలం. బతుకు తీరులోని ఉమ్మడితనాలే కారణం. జనం అలా కలసి మెలసి సాగే కమ్మని దృశ్యం సాక్షాత్కారం అయినప్పుడు ఆ పండగ వేరు.. ఆ సందడి వేరు!
- సత్యాజీ