Oct 02,2022 19:41

తెలుగు సినిమాల్లో పండుగలు, వేడుకలు, ఇతర సిట్యువేషనల్‌ సాంగ్స్‌ అనేకం ఉంటాయి. ఆయా సందర్భాలను బట్టి గీత రచయితలు అందించే సాహిత్యమూ అంతే అద్భుతంగా ఉంటుంది. అలాగే దసరా పండగ సందర్భంగా కొన్ని పాటలున్నాయి. వాటిలో ఆరాధనా గీతాలు కొన్నయితే, ఊరంతా సంబరంగా జరుపుకునే ఉత్సవ పాటలు మరికొన్ని. శ్రామిక, కర్షక శక్తికి తెలిపేవి ఇంకొన్ని.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది 1973లో విడుదలైన 'పెద్ద కోడలు' చిత్రంలోని 'ఈనాడే దసరా పండగ' అనే పాట. ఈ పాటలో సమాజపు విలువలు, శ్రామిక శక్తిని తెలిపే అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు డా.సి.నారాయణరెడ్డి. దేశ సరిహద్దులో అనుక్షణం కాపలా కాసే సైనికుడి గన్ను, నవసమాజ సౌధం నిర్మించే పెన్ను, ఇనుమును సైతం వంచగల శ్రామికుడి సుత్తి, రాళ్లను చీల్చి రతనాల పంట పండించే రైతన్న హలం.. ఇవన్నీ ఆయుధాలేనని, దసరా మహోత్సవం రోజు వాటికి ఆయుధ పూజ చేయాలని అంటారు నారాయణరెడ్డి. వేల ఎకరాల భూములు అందరిదనీ, చెమటోడ్చి పనిచేసేవాడే తలెత్తుకొని బతుకుతాడనీ.. ఇలాంటి మంచిరోజులు మనకు వస్తాయనే ఆశాభావాన్ని పాట రూపంలో వ్యక్తం చేశారు. దీంతోపాటు సంగీతం, నృత్యం వీనుల విందుగా, కనులకు కమనీయంగా ఉంటాయి. శోభన్‌బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పి.ఆదినారాయణ రావు దర్శకత్వం వహించారు.
దసరా పండగ అనగానే గుర్తుచ్చే మొదటి పాట 'దసరా వచ్చిందయ్యో సరదా తెచ్చిందయ్యో'. బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించిన 'లారీ డ్రైవర్‌' చిత్రంలోనిది ఈ పాట. బి.గోపాల్‌ దర్శకత్వంలో 1990లో విడుదలైన ఈ చిత్రంలోని పాట దసరా సంబరాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికీ దసరా ఉత్సవాల్లో మారుమోగుతుంది. సిరివెన్నెల అందించిన సాహిత్యానికి చక్రవర్తి సంగీతానికి, బాలు, చిత్ర గాత్రం అందించారు. 'అమ్మా అమ్మా మాయమ్మ అమ్మంటేనే నీవమ్మ' అంటూ తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు ఆమెను అమ్మవారితో పోల్చుతూ సాగే పాట ఇది. ఇవివి సత్యనారాయణ దర్శత్వంలో వెంకటేష్‌ నటించిన 'అబ్బాయి గారు' చిత్రంలోని ఈ పాటను వెన్నెలకంటి సాహిత్యం అందించారు. ఎస్‌పి బాలు ఆలపించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. జగపతిబాబు నటించిన 'శివరామరాజు' చిత్రంలోని 'అమ్మా భవాని' అనే పాట అమ్మవారి నవరాత్రుల సందర్భంగా సాగే పాట. ఊరు మంచికోసం నిర్వహించే వేడుకలో భాగంగా ఆ పాట సాగుతుంది. నవరాత్రులు, బతుకమ్మ.. పేరేదైనా ... అన్ని ప్రాంతాల్లోనూ తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో ఉత్సవాలు, పదోరోజు దసరా నాడు మహిషాసుర మర్దని ఘట్టం ప్రదర్శిస్తారు.. ఊరంతా జరుకునే ఇలాంటి సంబరాల్లో శ్రమను గుర్తించే సందర్భాలు మరిన్ని పాటలుగా రావాలని కోరుకుందాం.