Oct 13,2021 19:12

ఒకప్పుడు పండుగలు, ఉత్సవాల్లో విభిన్న కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. నృత్యాలు..వాయిద్యాలు..చెక్క భజనలు, సంగీత కచేరిలు, కోలాటాలను ప్రదర్శించే కళాకారులకు అత్యంత ఆదరణ లభించేది. జనసమూహాల మధ్య తమ కళను ప్రదర్శించేందుకు ఎంతోమంది సుదూరప్రాంతాల నుంచి కూడా తరలివచ్చేవారు. కాని రానురాను వారి పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. కళలు అంతరించిపోయి, కళాకారులంతా పొట్టచేతబట్టుకుని ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్నారు. కళనే నమ్ముకుని ఉన్న గురువులైతే వేరే పనిలోకి వెళ్లలేక, ఆదరించేవారు కానరాక యాచకం చేసుకుంటూ జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో కళారూపాలు ప్రదర్శిస్తున్నా కరోనా వచ్చి వారిని మరింత దీనస్థితికి దిగజార్చింది. తెలుగువారి పండుగల్లో అత్యంత వేడుకగా నిర్వహించే దసరా శరణవరాత్రి ఉత్సవాలు కళప్రదర్శనలకు పెట్టిందిపేరు. అయితే ఈ సారి ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా వల్ల ఆయా దేవాలయాల్లో కళారూపాలను ప్రదర్శించడం లేదు. ఒక వేళ ఉన్నా ఒకటి రెండు బృందాలతో కానించేస్తున్నారు.
కళాకారుల కళకు కరోనా
తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సందర్భాలలో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకున్నా కళాకారుల ప్రదర్శనలు మాత్రం కచ్చితంగా ఉండేవి. అలా ఉత్సవాల సందర్భంగా పండరి, కోలాటం, చెక్కభజన, కులుకు భజన, పిల్లంగటు,్ల చెట్టాల, తప్పెట గూళ్లు, కీలు గుర్రాలు, చిటెకెలు, బుర్రకథ, ఆసాది కథలు, పంబలు, గురవయ్యలు ఇలా 24 రకాల కళారూపాలను బృందాలుగా ప్రదర్శించేవారు. కళాకారుల వల్లే ఆయా పండగలకు ఆ కళ వచ్చేదనడం అతిశయోక్తి కాదు.

222


ఉపాధి మార్గంగా..
ప్రదర్శనలు చేస్తున్న ఒక్కో బృందానికి వేడుక నిర్వహించినన్ని రోజులూ పుష్కలంగా ఉపాధి దొరికేది. ఒకప్పుడు సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఇచ్చేవారు. మహమ్మారి ప్రభావం వల్ల వేడుకలకు జనం తండోపతండాలుగా రావడం మానేశారు. క్రమంగా ఆయా ఆలయాల ఆదాయాలు తగ్గిపోయాయి. ఈ ప్రభావం కళాకారుల ఉపాధిపై పడింది.
ఇతర పనులకు వెల్లిపోతున్న వైనం
గతంలో లాగా కళాకారులకు ఆహ్వానాలు లేకపోవడంతో వీరంతా ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనుల్లో కూలీలుగా కొందరు, ఇంకొందరు పట్టణాల్లో భవనిర్మాణ కార్మికులుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మరి కొందరు నేర్చుకున్న కళను వదులుకోలేక వాటిని ప్రదర్శించుకుంటూ యాచకం వైపు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ కళారూపాలన్నీ కనుమరుగైపోతాయి. ఇప్పటికే తోలు బొమ్మలాట, కొయ్యబొమ్మల ఆటలకు ఆదరణ లేకుండా పోయిందని ఎంతోమంది కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
30 వేల మంది ఉపాధికి ఎసరు
దేశంలోనే అత్యధికమంది కళాకారులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదరణ దొరికేది. ప్రతి ఏటా రెండు బ్రహ్మోత్సవాలతో పాటు మరి కొన్ని ఉత్సవాలు నిర్వహించడం, టిటిడికి అనుబంధంగా మరో 16 దేవాలయాలుండడం వల్ల కళాప్రదర్శనలు విరివిగా నిర్వహించేవారు. కళాకారులకు వసతి, ప్రత్యేక దర్శనం, అల్పాహారం, విద్య నేర్పిన గురువులకు గౌరవ సన్మానం, బృందాలు భజన చేస్తున్న దేవాలయాలకు వాయిద్య పరికరాలు ఇచ్చేవారు. ఇలా కళనే నమ్ముకున్న జానపద వృత్తి కళాకారులు దాదాపు 30 వేల మందికి పైగా అవకాశం దొరికేది. సంగీత కచేరిలు చేస్తున్న 1.50 లక్షల మంది కళాకారులు వీరికి అదనం. ఉపాధితో పాటు సంస్కృతి వారసులుగా వీరంతా శ్రమించేవారు. ఇప్పుడు కళలను ఆదరించేవారు లేరు. కళాకారులను ప్రోత్సహించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

444

ఆదరణ లేదు
కళనే నమ్ముకున్న మా కుటుంబాలు ప్రదర్శనలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. కుటుంబపోషణ కోసం ఏదొక పని చేసుకుంటూ జీవిస్తున్నాం. ఒకప్పుడు ఎంతో ఆదరణతో గౌరవంగా బతికిన మేము కూలిపనులకు వెళ్తున్నాం. గతంలో మాదిరి మా కళాకారులకు అవకాశాలు లేవు. కుటుంబ పరిస్థితులు చాలా దీనంగా తయారయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కళారూపాలన్నీ కనుమరుగైపోతాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలి.
సోమేశ్వర, కళాకారుడు, కడపజిల్లా

111


 


- సిఎస్‌ ప్రసాద్‌, చిత్తూరు ప్రతినిధి.