Sep 22,2022 06:16

రాష్ట్ర శాసనసభలో డేటా చౌర్యానికి సంబంధించి హౌస్‌ కమిటీ ప్రవేశపెట్టిన మధ్యంతర నివేదికలోని అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ప్రజల హక్కులకు రక్షణ కల్పించాల్సిన వారే దానికి భిన్నంగా వ్యవహరించారని ఈ నివేదిక పేర్కొనడం తీవ్ర ఆందోళనకరం. ప్రజలకు చెందిన సమాచారం చోరీ అయిందనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చిన కమిటీ 18 సర్వర్ల నుండి సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు తరలించారని పేర్కొంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారని హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భూమన కరణాకర్‌రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించారు. కమిటీ ఇప్పటికే నిర్ధారించిన అంశాలతో పాటు ఓట్ల తొలగింపునకు కుట్ర చేశారంటూ చేసిన ఆరోపణలను తేలికగా తీసుకోవడానికి వీలులేదు. డేటాను పెగాసస్‌ స్పైవేర్‌తో చోరీ చేశారా? మరేదన్నా పద్ధతుల్లో తరలించారా అన్న విషయమై కమిటీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సమర్పించింది మధ్యంతర నివేదిక కాబట్టి మలివిడత విచారణలో డేటా చోరీ కోసం వినియోగించిన పరికరాలపైనా, వాటిని ఎక్కడి నుండి కొనుగోలు చేశారన్న అంశంపైనా దృష్టి పెడతారని చెబుతున్నారు. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ఇది నేరుగా రాజ్యాంగం ప్రజానీకానికి దఖలు పరిచిన హక్కులపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా దాడి చేయడమే! జస్టిస్‌ కె.ఎస్‌ పుట్టుస్వామి వర్సస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా 2018లో వ్యక్తిగత గోప్యతను కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగానే చూడాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. డేటా చౌర్యాన్ని నిరోధించి పూర్తి స్థాయిలో ప్రజల హక్కులను కాపడాటానికి సమగ్ర చట్టం రూపొందించాల్సిన బాధ్యత కేంద్రానిదే! 2019 నుండి ఆ దిశలో జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఐటి చట్టంలో కొన్ని అంశాలు పేర్కొన్నప్పటికీ అవి అరకొరే! రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన తాజా అంశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సి ఉంది.
ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉన్న 30 లక్షల మంది సమాచారాన్ని తస్కరించి, వారి ఓట్లను తొలగించడానికి కుట్ర చేశారని హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ శాసనసభలో ప్రకటించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వమూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్న వేళ ఈ అంశం వెలుగులోకి రావడం ప్రాధాన్యత నంతరించుకుంది. ఓటరు కార్డును ఆధార్‌తో లింకు చేసే ప్రక్రియ స్వచ్ఛందమేనని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపినప్పటికీ ఆచరణలో దానికి భిన్నంగా జరుగుతోంది. అనేక చోట్ల అధికారులు ఆధార్‌తో లింకుతో చేసుకోకపోతే ఓటుహక్కును రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా హెచ్చరించడం, ఆధార్‌ నంబర్‌కోసం పట్టుబట్టడం సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకమైనప్పటికీ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటే పైనుండి ఉన్న ఒత్తిడే కారణమన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆధార్‌ డేటా అనేక విధాలుగా దుర్వినియోగం అయినట్టు, పలు ప్రైవేటు సంస్థలకు ఈ డేటా అందుబాటులోకి వచ్చినట్టు వార్తలు వచ్చాయి. సాక్షాత్తు ఎలక్షన్‌ కమిషనే 2015లో నేషనల్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ ప్యూరిఫికేషన్‌ పేరిట ఈ తరహా దుశ్చర్యకు తెగబడింది. ఓటు హక్కుకు గండి కొట్టడం ద్వారా ప్రజాతీర్పును తారుమారు చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఆధార్‌ లింకేజి దొంగచేతికి తాళం ఇచ్చిన విధంగా మారుతుంది. పౌరుల డేటాకు ఎటువంటి రక్షణ లేకపోవడతో అక్రమార్కులకు పట్టపగ్గాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ తరహా ప్రయత్నాలతో తమకు సంబంధంలేదని ఎన్నికల కమిషన్‌ తప్పించుకోజాలదు. ఓటర్ల జాబితాతోపాటు, ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు తొలగించాలి. హౌస్‌ కమిటీ నివేదికలోని అంశాలపై నిజానిజాలను నిగ్గుతేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం డేటా రక్షణకు సమగ్ర చట్టం చేసి, ప్రజల హక్కుల పరిరక్షణకు పూచీ ఇచ్చేంతవరకు ఆధార్‌తో ఓటర్‌కార్డును అనుసంధానం చేసే ప్రక్రియను నిలిపివేయాలి. ఎన్నికల ప్రక్రియపైనా, ప్రజాస్వామ్యంపైనా అప్పుడే సామాన్యులకు నమ్మకం కలుగుతుంది.