Nov 21,2020 06:49

దుబ్బాక దెబ్బతో టిఆర్‌ఎస్‌, దేశమంతా చతికిల పడిన కాంగ్రెస్‌, ఉప ఎన్నిక గెలుపు ఊపులో హైపులో బిజెపి, తన కోటలు కాపాడుకోవాలనే తపనలో మజ్లిస్‌...ఇదీ డిసెంబర్‌ ఒకటిన జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల ముందస్తు దృశ్యం. కమిటీలను నియమించుకోవడంలోనూ కసరత్తులు జరపడంలోనూ ఎవరి తొందర వారిదిగా సిద్ధమైపోయారు. బిజెపి అయితే ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ ను ఇన్‌చార్జిగా చేసి కర్ణాటక మంత్రి సుధాకర్‌ను తోడుగా ఇచ్చింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం తగ్గించి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకి స్వేచ్ఛ ఇవ్వడానికేనని అంతర్గత సమాచారం. కాంగ్రెస్‌, బిజెపి కూడా ఎం.పి లను, రాష్ట్ర నాయకులను స్థానిక స్థాయిలో బాధ్యతలు అప్పగించాయంటే ఈ ఎన్నికను ఎంత తీవ్రంగా తీసుకుంటున్నదీ తెలుస్తుంది. గత సారి జరిగిన ఎన్నికలలో ఒకటి అరా స్థానాలకు పరిమితమైన, అసలే శూన్యాంకంగా మిగిలిపోయిన పరిస్థితి ఈ పార్టీలను వెన్నాడుతున్నదనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణ ఏర్పడిన కొత్త దశ, మంత్రి కెటిఆర్‌ అన్నీ తానై రంగం లోకి దూకి వాగ్దానాలు గుప్పించడం అప్పటి ఫ్లాష్‌బ్యాక్‌. వరంగల్‌ లోక్‌సభ, జిహెచ్‌ఎంసి, పాలేరు ఉప ఎన్నికలు టిఆర్‌ఎస్‌ కు బాగా ఊపునిచ్చిన ఘట్టాలు. ఇప్పుడు దుబ్బాక, జిహెచ్‌ఎంసి, శాసనమండలి ఎన్నికలు మరో మూడు పరీక్షలుగా వచ్చిన సందర్భం. 2018లో గెలిచిన టిఆర్‌ఎస్‌ పట్ల, కెసిఆర్‌ ప్రభుత్వం పట్ల ప్రజల మూడ్‌ ఎలా వుందో ఈ మూడు ఎన్నికల తర్వాత కొంత అంచనాకు వచ్చే వీలుంటుంది. ఇందుకు తోడు అన్ని చోట్ల పోటీ చేస్తున్న తెలుగుదేశం, యాభై స్థానాలలో ఉభయ కమ్యూనిస్టుల పోటీ, తొలిసారి గ్రేటర్‌లో ఒంటరిగా దిగుతున్న జనసేన, ఇంకా ఇతర శక్తులు, ఎన్నికలను రసవత్తరం చేస్తాయి.
 

మజ్లిస్‌ పల్లవితో బిజెపి మతతత్వ ప్రచారం
వివిధ కుల, మత, ప్రాంత రాష్ట్రాలకు చెందిన జనాభాతో కూడిన మహా నగరం పొందిక, ఓటర్ల సరళి ఏవీ దుబ్బాకకు పోలిక వుండేవి కావు. స్థానిక ఎన్నికలలో రాజకీయ అంశాలకన్నా స్థానిక సమస్యలే ఎక్కువ ప్రాబల్యం వహిస్తాయనేది కూడా వాస్తవం. ఈ మధ్య కుంభవృష్టితో అతలాకుతలమైన కాలనీల కష్టాలు పాలక పక్షానికి ప్రతికూలంగా మారతాయనేది ప్రతిపక్షాల అంచనా. అయితే ఆ కారణంగానే ఎన్నికలు త్వరగా ముగిచ్చేద్దామనేది టిఆర్‌ఎస్‌ ఆలోచనగా అనిపిస్తుంది. ఇంత స్వల్ప కాలంలో ఇన్ని చోట్ల కేంద్రీకరించే వనరులు, యంత్రాంగం కలసి వస్తాయని కూడా వారి అంచనా. దీన్ని తీవ్ర సవాలుగా తీసుకోవాలని మంచి ఫలితాలు రాకుంటే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గట్టి ఆదేశాలు ఇచ్చి రంగం లోకి దింపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఏమీ రాలేదని మాత్రమే గాక నగరానికి ద్రోహం చేసిందని కూడా అధికార పార్టీ పత్రిక పతాక శీర్షికలతో రాస్తున్నది. దెబ్బ తిన్న ఇళ్లకు రూ. పది వేల చొప్పున పరిహారం ఇవ్వడంలో అవకతవకలపై ఫిర్యాదులు వున్నా అది అనుకూలంగా పని చేస్తుందని రాని వారు కూడా తాము రావాలని కోరుకుంటారని కూడా వారికి ఆశ వుండింది గానీ బిజెపి అధ్యక్షుడు బండి సంజరు ఫిర్యాదుతో ఆ పంపిణీ నిలిపేశారు (ఆ లేఖ తాను రాయలేదని, ఫోర్జరీ అని, ప్రమాణం పేరుతో ఆయన భాగ్యలక్ష్మి గుడి దగ్గర హైడ్రామా నడపడం మరో వింత). గతంలో వంద స్థానాలు గెలవడమే గాక మజ్లిస్‌తో స్నేహం కూడా చేశారు. ఈసారి తమకు ఎలాంటి పొత్తు లేదని మంత్రి కెటిఆర్‌ ప్రకటించారు. నూట యాభై కార్పొరేషన్‌ డివిజన్లు కాగా యాభై రెండు మంది ప్రజాప్రతినిధులు కోఆప్టెడ్‌ వుంటారు. కోఆప్టెడ్‌ సభ్యులు 38 మందిని కలుపుకుంటే టిఆర్‌ఎస్‌ మేయర్‌ పదవి పొందడం పెద్ద కష్టం కాదు. అదే మరొకపార్టీ అయితే వంద ఇక్కడే తెచ్చుకోవాల్సి వుంటుంది. మజ్లిస్‌ మేయర్‌ వస్తాడంటూ దాన్ని ప్రధానంగా చూపుతూ తమది బరాబర్‌ హిందూ పార్టీ అని దుబ్బాక ఫలితాలకు ముందే బండి సంజరు ప్రక టించారు. ఈ కారణంగా నగరంలో మత సామరస్యాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన అంశంగా వుంటుంది. విభజన తర్వాత తొలి దశలో గత ఎన్నికల సమయంలో ఆంధ్ర, తెలంగాణ అన్న కోణం ప్రధానంగా ప్రచారం జరిగింది గాని ఇప్పుడా పరిస్థితి మారింది. అయినా టిఆర్‌ఎస్‌ నాయకుల మాటల్లో ఆ ధోరణి కొనసాగడం ఒకటైతే...150 స్థానాల్లో పోటీ పెడుతున్న టిడిపి ఆ ఓట్లను ప్రాంతాల వారిగా కులాల వారిగా ఎలా చీలుస్తుందన్నది మరో లెక్కగా వుంది. 'నమస్తే తెలంగాణ' లోనూ 'ఆంధ్రజ్యోతి' లోనూ కూడా ప్రాంతాలు, కులాల పేర్లతో సమీకరణాల వార్తలు కనిపిస్తున్నాయి. ఏమైనా ఉమ్మడి రాజధానిగా ఇవే చివరి ఎన్నికలవుతాయి.
 

సమస్యలలో కేంద్ర రాష్ట్రాల పాత్ర
మహా నగరంలో పౌర సమస్యలు, రహదారులు, వాహనాల రద్దీ, పారిశుధ్యం, మురుగునీటి పారుదల, నాలాల రక్షణ, పేదవాడలలో వసతులు, కట్టిన ఇళ్లలో ప్రవేశం, ఆక్రమణలకు అడ్డుకట్ట వంటి అంశాలపై కేంద్రీకరించాల్సిన అవసరం వుంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ వికాసానికి కేంద్రం కూడా మరింత చేయూత నివ్వాల్సి వుంటుంది. కాని స్మార్ట్‌ సిటీస్‌ హంగామా ఆచరణలో పెద్దగా అక్కరకు రాలేదు. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన వంటి అంశాల గురించి మాట్లాడే పరిస్థితి ఊహించగలమా అనేది ప్రశ్న. హైదరా బాద్‌కు పెట్టుబడులు జోరుగా వస్తున్నాయనే ప్రచారం, ప్రభావం ఎలా వున్నా కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధి, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిని కూడా మెరుగు పరచడంపై కేంద్రీకరణ కోరుకుంటుండగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ బిజెపి పైన కేంద్ర విధానాలపైన తీవ్ర విమర్శలతో విరుచుకుపడి మరో మలుపు తిప్పారు. కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకూ, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ రెండవ వారంలో ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. దీన్ని కేవలం కార్పొరేషన్‌ పాచికగా కొట్టిపారేసే వారున్నా దేశంలో పరిణామాలను బట్టి అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. గతంలో బిజెపితో మెతగ్గా, స్నేహంగా మసలినా కెసిఆర్‌ క్రమేణా విమర్శల జోరు పెంచడం కనిపిస్తూనే వుంది. హిందూత్వ రాజకీయాల దూకుడు పెంచడమే గాక రాష్ట్రాల హక్కులు, అధికారాలు, వనరులను హరిస్తున్న కేంద్రం ధోరణి ఇందుకు ప్రధాన కారణం. రైతు వ్యతిరేక శాసనాలు, పౌరసత్వ సవరణ చట్టం, విద్యుత్‌ సంస్కరణల పేరట ప్రైవేటీకరణకు పెద్ద పీట, జిఎస్‌టి బకాయిలపై దొంగాటకం ఇవన్నీ రాష్ట్రాలలో నిరసన పెంచాయి. కేరళ లోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం, బెంగాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ ప్రభుత్వాలతో పాటు ఈ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన వేదికలలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా పాలుపంచుకుంది. కేంద్ర శాసనాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానాలు చేసింది. కనుక ఇది ఒకరోజు జరిగిన పరిణామం కాదని చెప్పొచ్చు.
 

కాంగ్రెస్‌ ఆరోపణలు
రాష్ట్రంలో తానే ప్రత్యామ్నాయంగా అధికారం లోకి వస్తామని చెబుతున్న బిజెపి కి బండి సంజరు అధ్యక్షుడైనాక ప్రభుత్వంపై దాడి తీవ్రతే గాక భాష కూడా మారింది. తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా , ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించే వరకూ వెళ్లింది. తాము కేంద్రం నుంచి పంపే నిధుల తోనే అంతా జరిగిపోతున్నట్టు, కెసిఆర్‌ వాటిని తమ పథకాలుగా చలామణి చేసుకుంటున్నట్టు ఆరోపణలు నిత్యకృత్యమైనాయి. ఈ పూర్వ రంగం లోనే దుబ్బాక ఉప ఎన్నికలలో కేంద్ర రాష్ట్ర పథకాలు, నిధుల గురించి సవాళ్లు ప్రతి సవాళ్లతో నడిచాయి. బిజెపి నోట్ల పట్టివేత, నాయకుల అరెస్టు కూడా వేడిని పెంచాయి. బిజెపి ని కావాలని పెద్దదిగా చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నా దాన్ని తీవ్రంగా తీసుకోవడం కష్టం. కాంగ్రెస్‌లో అంతర్గతంగానే అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. దేశమంతటా దెబ్బ తింటున్న కాంగ్రెస్‌ తెలంగాణ లోనూ వెనకబడి వుండగా దాని కోసం లేని బిజెపిని పెద్దగా చూపడం జరిగే పని కాదు. త్రిపురలో, అసోంలో బిజెపి అధికారానికి రావడం బెంగాల్‌లోనూ పెద్ద పార్టీగా రూపొందడం జరిగాక ప్రాంతీయ పార్టీలు దాని సవాలును తీవ్రంగానే తీసుకుంటున్నాయి. మరో వంక విధానపరంగా ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలైన అకాలీదళ్‌ వంటివి కూడా దూరమవుతున్నాయి.
 

ఫలితాల తర్వాతే స్పష్టత
ముఖ్యమంత్రి విమర్శలో కేవలం రాజకీయ విధానాలే గాక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం వంటి అంశాలు కూడా ప్రస్తావనకు రావడం అరుదనే చెప్పాలి. వామపక్షాలు, కార్మిక సంఘాలు మినహా తక్కిన వారు ఈ అంశాలను వ్యతిరేకించడం సాధారణంగా చూడం. వాటి విధానాలు అంతకంటే ఎక్కువగా ప్రైవేటుబాటలో వుండటమే కారణం. పాత కాలపు రాజకీయ వేత్త అయిన కెసిఆర్‌ కొంతవరకూ ప్రభుత్వ పాత్రను కాపాడాలనే వైఖరి తీసుకోవడం వాస్తవం, ఆర్టీసి సమ్మె వంటి విషయాలలో వైఖరి భిన్నంగా వున్నా ఇప్పటికి దాన్ని కాపాడతాననే అంటున్నారు.


హైదరాబాదులో ప్రభుత్వ రంగ మాజీ ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగానూ వుంటుంది. మైనార్టీ జనాభా కూడా గణనీయం. కెసిఆర్‌ వ్యూహం వెనక ఈ కారణాలన్నీ వుండొచ్చు. గతంలో ఎన్‌టిఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక విజయవాడలో ప్రతిపక్షాల శిఖరాగ్ర సభ జరపడం పెద్ద సంచలనమైంది. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ముందున్నారు. రథయాత్ర తర్వాత బిజెపి ని దూరం వుంచారు కూడా. అదే చంద్రబాబు హయాంలో బిజెపి నాయకత్వం లోని ఎన్‌డిఎ లో రెండు సార్లు జూనియర్‌ భాగస్వాములయ్యారు. ఇప్పుడూ వారి మెప్పు కోసం పాకులాడుతున్నారు. కెసిఆర్‌ ఇప్పుడు బిజెపి కి వ్యతిరేకంగా ఆ తరహాను అనుసరిస్తే పెద్ద మార్పే అవుతుంది. చాలా మంది నాయకులతో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని ఆయన చెబుతున్నారు. 2018 శాసనసభ మధ్యంతర ఎన్నికల ముందు బిజెపి, కాంగ్రెస్‌ లకు వ్యతిరేకంగా కెసిఆర్‌ చెప్పిన ఫెడరల్‌ ఫ్రంట్‌ మోడీకే మేలు చేసేదిగా కనిపించింది. అది వాస్తవ రూపం దాల్చలేదు కూడా. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ ఊసే లేకపోయింది. ఇప్పుడు కేవలం బిజెపి కే వ్యతిరేకంగా అని చెప్పడం, దేశంలోనూ వారిపై వ్యతిరేకత పెరగడం బట్టి ప్రస్తుత ప్రతిపాదనను భిన్నంగా చూడవలసి వుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వం బిజెపి కి, కేంద్రానికి లోబడిపోయే విధానం అనుసరిస్తున్న పూర్వరంగంలో కెసిఆర్‌ ప్రకటన మరింత ప్రాధాన్యత పొందడం సహజమే. అయితే కార్పొరేషన్‌ ఫలితాలు ప్రభావాలు తర్వాత గాని దీని స్వరూప స్వభావాలు స్పష్టం కావు. బిజెపి వినాశకర విధానాలపై కెసిఆర్‌ విమర్శలను ఆహ్వానిస్తూనే ఆచరణలో పోరాటానికి కలసి రావాలని, ఆ తరహా విధానాలకు రాష్ట్రంలో చోటు లేకుండా చేసి సమస్యలను పరిష్కరించాలని వామపక్షాలు కోరుతున్నాయి.
                                                                                                                      * తెలకపల్లి రవి