May 14,2022 09:32

'అయ్యో... చిన్న వయసులోనే భర్త పోయాడు. పిల్లలు చిన్న వాళ్లు.. ఎలా బతుకుతుందో...? ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది... పెళ్లైన మూడునెళ్లకే కట్టుకున్నోడు పోయాడు..' అని జీవిత భాగస్వామిని కోల్పోయిన మహిళల పట్ల ఈ సమాజం విచారం వ్యక్తం చేస్తుంది. అయితే, వితంతువు అయిన ఆ మహిళ పట్ల ఆ తరువాత సమాజం ప్రవర్తించే తీరు విచిత్రంగా మారిపోతుంది. ఆ రోజు నుంచి ఆమె గౌరవం లేని మహిళ. శుభకార్యాలకు, పండుగలకు, పెళ్లిళ్లకు ఆమె ఉనికి పనికిరాదు. అంతవరకు ఎందుకు... ఆమె రంగు, రంగుల దుస్తులు ధరిస్తేనే గుసగుసలాడుకుంటారు. భర్త పోవడంతోనే ఆమె అలంకరణకు పనికిరాని మనిషిగా పరిగణిస్తుంది ఈ సమాజం. భర్తతోనే నుదిటి బొట్టు, పూలు, గాజులు ఆమెకు దూరం చేస్తారు నిర్దాక్షిణ్యంగా. ఆచారాల పేరుతో మహిళ పట్ల ఇంత వివక్ష తగదని ఎంతోమంది సంఘ సంస్కర్తలు నినదించినా చాలాచోట్ల నేటికీ ఈ తంతు సాగుతూనే ఉంది. అయితే మహారాష్ట్ర కొల్హాపూర్‌ జిల్లా హెర్వాడ్‌ గ్రామ మహిళలు ఈ ఆచారానికి స్వస్తి పలికేందుకు నడుం బిగించారు.
    పూణెకు 250 కిలోమీటర్ల దూరంలో ఉందా గ్రామం. అన్ని గ్రామాల వలె ఆ గ్రామంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరుస్తుంటాయి. ఇప్పుడు ఆచారం పేరుతో మహిళల హక్కులు కాలరాస్తున్న పితృస్వామ్య భావజాలానికి ఆ గ్రామం చరమగీతం పాడింది. వితంతు స్త్రీలను అణిచివేసే ఆచారాలను నిషేధిస్తూ గ్రామ పంచాయతి గతవారం తీర్మానించింది.
    హత్కంగల్‌ తెహ్సిల్‌లోని మంగావ్‌ గ్రామ సభ కూడా ఇలాంటి నిర్ణయమే చేసింది. అంటరానితనాన్ని రూపుమాపేందుకు అంబేద్కర్‌, సాహూ మహారాజ్‌ సంయుక్తంగా నిర్వహించిన తొలి సమావేశం ఈ గ్రామంలోనే జరిగింది. 'మహాత్మ ఫూలే సమాజ్‌ సేవ' సంస్థ ద్వారా ఈ క్రతువుల నుంచి మహిళలకు రక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో కోవిడ్‌కు ముందు నుంచే నిర్వాహకుడు ప్రమోద్‌ జింజాద్‌ కృషి చేస్తున్నారు. ఆయన చొరవతోనే ఈ రెండు గ్రామాలు చరిత్ర తిరగరాసే లక్ష్యాలతో ముందుకెళుతున్నాయి.
    భాగస్వామి పురుషుడు మరణిస్తే ఇక ఆ మహిళ బతుకంతా చీకటిమయమే అన్నట్లు ఉన్న ఈ ఆచారాలను ఎంతోమంది స్త్రీ, పురుషులు బాహటంగా సమర్థిస్తుంటారు. వివాహంతో ఆమెకు సంక్రమించే అదనపు అలంకరణలను, పుట్టుకతో ఆమె అనుసరిస్తున్న విధానాలను అతని మరణంతో ముడిపెట్టి వాటిని సమూలంగా తుడిచేస్తుంటారు. ఇది తిరోగమన చర్యకు సంకేతం. అతనితోనే ఆమె అన్నట్లుగా... అతని చావుతో ఇక ఆమెకు బతికే అవకాశం లేనట్లుగా చేస్తారు. ఇంకా క్రూరంగా ఆమెను 'దురదృష్టవంతురాలి'గా ముద్రవేస్తారు.
    'నా భర్త చనిపోయిన తరువాత వారు నా నగలను తీసివేశారు. నా నుదిటి సింధూరాన్ని నీళ్లతో కడిగేశారు. అప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన.. వీళ్లంతా ఎవరు? నా శత్రువులా.. నా జీవితాన్ని అంధకారం చేస్తున్న వీరంతా నా బంధువులు, నా పొరుగువారు, నా స్నేహితులు. వీరా నా శ్రేయోభిలాషులు! నాశనమై పోయిన నా జీవితం గురించి వీరసలు ఆలోచించడం లేదు. వీరి శ్రద్ధ అంతా నన్ను జీవితాంతం వేధించే కనికరమే లేని ఆచారాల గురించే' అని ఆవేదన వ్యక్తం చేసింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల వితంతువు.

bangles 22


     'కోవిడ్‌ కారణంగా మా గ్రామంలో 12 మంది మహిళలు భర్తలను కోల్పోయారు. వారంతా చిన్నవయసు వారు. కొంతమందికి పిల్లలు కూడా లేరు. ఇంకొంతమందికి చాలా చిన్న పిల్లలున్నారు. కోవిడ్‌ వల్ల భర్తలను కోల్పోయిన మహిళల సంక్షేమం కోసం మేం గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. పిల్లల చదువులు, ఇంటి ఖర్చుల నిమిత్తం రూ.5000 చొప్పున ఆర్థిక సాయం చేశాం. అయితే వాటన్నింటికంటే ముందు వారిని జీవితాంతం వేధించే వితంతు ఆచారాలను రూపుమాపాలని నిర్ణయించాం. సమాజంలో చాలా విస్తృతంగా పాతుకుపోయిన ఈ ఆచారాన్ని బహిష్కరించేందుకు గ్రామమంతా ఒక్కతాటిపై నిలిచింది. మహిళల గౌరవ మర్యాదలను కాపాడే ఈ నిర్ణయాన్ని మా పంచాయతి పెద్దలు సంపూర్ణ మద్దతుతో తీర్మానించారు. ఈ ఐక్యతే ఆ మహిళలకు కొండంత అండ, ధైర్యాన్నిస్తుంది' అంటారు హెర్వాడ్‌ గ్రామ సర్పంచ్‌ సుర్గొండ పాటిల్‌.
    'మన రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛతో జీవించే హక్కు ఉంది. ఈ ఆచారం అందుకు విరుద్ధంగా ఉంది. మహిళలను వారి హక్కుల నుంచి దూరం చేసే ఈ ఆచారాన్ని ప్రతి ఒక్కరూ తిరస్కరించాలి' అంటారు ఆ గ్రామ మహిళా పంచాయతి సభ్యులు. 'మా గ్రామంలోనే కాదు; దేశంలోని మహిళలందరికీ ముఖ్యంగా ప్రతి వితంతువుకూ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. కాని అలా జరగడం లేదు. వితంతువులను సమాజానికి దూరంగా ఉంచుతున్నారు. ఇకనుంచైనా ఆమెను గౌరవంగా చూడాలన్న లక్ష్యంతోనే మా గ్రామంలో ఈ తీర్మానం చేసుకున్నాం. గ్రామ ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తాం' అంటున్నారు వారంతా ముక్తకంఠంతో.
    ప్రపంచంలోనే మనదేశంలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉంది. విపరీతమైన హింసకు, వివక్షకు గురయ్యేది కూడా ఇక్కడే. స్వతహాగా పుట్టుకతోనే సంక్రమించిన ఆమె హక్కులన్నీ భర్త మరణంతో తుడిచిపెట్టుకుపోతాయి. మరికొన్ని చోట్లైతే బానిసలుగా బతుకుతుంటారు. ఇప్పుడు ఈ రెండు గ్రామాలూ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో వివక్షకు గురవుతున్న ఎంతోమంది వితంతు మహిళలకు వెలుగు రేఖ కావాలి. అది చట్టబద్ధం కావాలి. సమాజం కూడా ఈ కనీస హక్కును గౌరవించాలి. అర్థం లేని ఆచారాలకు ముగింపు పలకాలి.