
న్యూఢిల్లీ : ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించే సదుపాయాన్ని ఉచితంగా కనీసం మరో ఏడాది పాటు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కోరారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు. దీనిపై ఎలక్ట్రానిక్, ప్రచార సాధనాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అప్పుడే సామాన్యులు సైతం ఈ అవకాశానిు ఉపయోగించుకోగలుగుతారని అన్నారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా తపన్‌సేన్ మంత్రినికోరారు. ప్రతి విషయానికి తప్పనిసరిగా ఆధార్‌ను అనుసంధానం చేయడం పట్ల తమకు కొన్ని అభ్యంతరాలు వున్నాయన్నారు. అవి కాకుండా పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలను నిబంధనను అమలు చేయాలనుకుంటున్న తీరును కూడా తీవ్రంగా సమీక్షించి పునరాలోచించాల్సిన అవసరం వుందని తపన్‌సేన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆధార్‌తో పాన్‌ను అనుసంధానించనట్లైతే సదరు వ్యక్తి పాన్ కార్డు పనికిరానిదిగా మారుతుందని, పాన్ వివరాలు అందజేయనందుకు ఆదాయపన్ను చట్టం కింద అన్ని పర్యవసానాలకు జవాబుదారీ వహించాల్సి వుంటుందని పేర్కొంటూ సిబిడిటి గతేడాది సర్క్యులర్ జారీ చేసింది. నోటిఫై చేసిన తేదీలోగానే ఇది జరగాల్సి వుందని అన్నారు. సిబిడిటి లేదా మరే ప్రభుత్వ సంస్థ జారీ చేసిన సర్క్యులర్లు లేదా ఐటి చట్ట నిబంధనలు వంటివి మెజారిటీ జనాభాకు తెలియవని, ఫలితంగా బాధితులుగా మారేది సామాన్యులే అవుతారని తపన్‌సేన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆధార్‌ను పాన్‌తో అనుసంధానించని వారిపై చర్యలు తీసుకోవడానికి ముందుగా దీనిపై విస్తృతం ప్రచారం చేయాలని ఆయన కోరారు.