Jan 01,2021 20:09

కళ్లంలో ఉన్న ధాన్యం బస్తాలు

ప్రజాశక్తి-బొబ్బిలి : దేశానికి రైతే వెన్నెముక, రైతే రాజు.. అంటూ సభలు, సమావేశాల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేసే ప్రజాప్రతినిధులకు రైతుల సమస్యలు పూర్తిగా పట్టడం లేదు. అప్పులు చేసి చెమటోడ్చి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ధాన్యం అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని మిల్లర్లు చేతులెత్తేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని మిల్లర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు దాటింది. అయినా మిల్లర్లు ధాన్యం తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోకపోవడంతో కేంద్రాల్లోనే ధాన్యాన్ని కుప్పలు వేసి నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్‌ వరిపంట కోతదశకు వచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు వరి చేలను పూర్తిగా కోయలేదు. దీంతో ధాన్యం మిల్లింగ్‌ చేసేటప్పుడు ముక్క(నూకలు) అవ్వడంతో నష్టపోతున్నామనే సాకు చూపుతున్నారు. 30 నుంచి 40 శాతం వరకు నూకలు రావడంతో సివిల్‌ సప్లై గోదాముల్లో బియ్యాన్ని తీసుకోవడం లేదని మిల్లర్లు సాకులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రవాణా ఛార్జీలలో సగం రైతులు చెల్లించాలని మిల్లర్లు కోరడంతో ఇతర జిల్లాలకు కూడా వెళ్లే పరిస్థితి లేదు.
పొలంలోనే వరిచేను కుప్పలు
ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో నారసింహునిపేట, గోపాలరాయుడుపేట, దిబ్బగుడివలస, కోమటిపల్లి, చింతాడ, కలవరాయి, తదితర గ్రామాల్లో రైతులు వరిచేలను పొలంలోనే కుప్పలు వేసి ఉంచేస్తున్నారు. అప్పుల బాధ పడలేని రైతులు వరిపంటను నూర్పు చేసినప్పటికీ ధాన్యాన్ని అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో దళారులకు అమ్ముకుంటున్నారు. క్వింటా ధాన్యాన్ని రూ.1600 వరకు కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. అందులోనూ తూనిక అదనంగా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు బస్తాలు రాకపోవడంతో రైతులు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
5 కిలోలు చెల్లించాలి
40 కిలోల బస్తాకు తరుగు కింద ఐదు కిలోల ధాన్యం అదనంగా చెల్లించాలని మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రయివేటు వ్యాపారులు మూడు కిలోలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కూడా అదనంగా మూడు కిలోలు చెల్లించేలా చట్టబద్ధత చేసేశారు. అదనంగా మూడు కిలోలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించినా ఐదు కిలోలు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.
ఇతర జిల్లాలకు తరలిస్తాం
రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో కొంటున్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోకపోవడంతో ఇతర జిల్లాల మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 2148 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటాం.
- గౌరీశంకర్‌,
సివిల్‌ సప్లరు డిప్యూటీ తహశీల్దార్‌