Jul 28,2021 23:40

సమావేశంలో మాట్లాడుతున్న రామారావు

ప్రజాశక్తి - అమరావతి : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలను సత్వరం చెల్లించకుంటే ఆందోళన చేపడతామని సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విస్తృత సమావేశానికి మొహిద్దీన్‌ వలి అధ్యక్షత వహించారు. రామారావు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాల కోర్చి పండించిన ధాన్యాన్ని మార్కెట్‌ యార్డుల్లో మూణ్ణెల్ల కిందటే అమ్మినా ఇప్పటికీ డబ్బులు చెల్లింలేదన్నారు. కరోనా పరిస్థితులతో ఉపాధి కోల్పోయి జీవనం భారంగా మారిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాల్జేస్తోందని విమర్శించారు. పసుపు రైతులనూ అదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అర్ధాకలితో అలమటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రో, గ్యాస్‌ భారాలు మోపుతోందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకూ కారణమవుతోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే పోరాటాల్లో అన్ని రంగాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టే చట్టాలను రద్దు చేయాలని కొరుతూ 9వ తేదీన చేపట్టే నిరసనలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం నాయకులు చింతల భాస్కర్‌రావు, వై.కృష్ణ, పూర్ణయ్య, పుల్లారావు పాల్గొన్నారు.