Jun 23,2021 15:02

నరసాపురం (పశ్చిమ గోదావరి) : ధాన్యం డబ్బులు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రోడ్లు నిర్భందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కార్యదర్శులు ఆకుల హారేరామ్‌, మామిడిశెట్టి రామాంజనేయులు హెచ్చరించారు. ఈ మేరకు ధాన్యం డబ్బులు వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంట మాసూలు చేసి ధాన్యం అమ్మి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవటం దారుణమన్నారు. గత సారవ పంటకు తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులు, పేద రైతులు ప్రైవేటు వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు పండించారన్నారు. ఈ పరిస్థితుల్లో పంట చేతికొచ్చాక ప్రభుత్వం మూడు నెలలైనా డబ్బులు వేయకపోవటంతో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెచ్చిన అప్పులకు నెలలు తరబడి అదనంగా వడ్డీలు కడుతూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నర్సాపురం ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆర్‌డిఓ మాట్లాడుతూ.. సమస్యపై సివిల్‌ సప్లయి జిల్లా మేనేజరుతో మాట్లాడి వెంటనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, రైతులు బి.జార్జి, వై.నారాయణమూర్తి, కె.శ్రీనివాసు, పి.కామేశ్వరావు, కె.గురవయ్యనాయుడు, బి.విజయకుమార్‌, ఎం.సుబ్బారావు, జె.రామ్మోహనరావు, కె.బాలరాజు ఇతర సభ్యలు పాల్గొన్నారు.