Nov 30,2022 21:47

ధర్నా చేస్తున్న రైతులు, రైతుసంఘం నాయకులు

కొమరాడ : ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని కోరుతూ బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటు దాసు, మండల అధ్యక్ష, కార్యదర్శి నారాయణ, ఎ.ఉపేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు పంట పండించి తమ పొలాలలో ధాన్యం కుప్పలు కుప్పలుగా పోగు చేసుకుంటున్నా నేటికీ కొనుగోలు చేయకపోవడం చాలా దుర్మార్గమన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యం పాడైపోతాయేమోనని రోడ్ల మీద ఎండబెట్టుకునే పరిస్థితి రైతుకు ఎదురవుతుందని వాపోయారు. ఇలాంటి సందర్భంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు రైతు సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకుల అండతో మిల్లర్లు కారుచౌకగా, బలవంతంగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై సమాచారమిచ్చినా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని, సరిపడా గోనెసంచులు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనకు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం తహశీల్దార్‌ రాధాకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బి.గౌరునాయుడు, శ్రీను, బుజ్జి, అప్పలస్వామి, లక్ష్మునాయుడు , రాము, ఎ.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.