
ప్రజాశక్తి-కలెక్టరేట్ : జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, అందుకు అధికారులంతా సహకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కోరారు. బుధవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జెసి ఒ.ఆనంద్, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే వాటిని సిఎం, సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జెసి ఆనంద్ మాట్లాడుతూ బ్యాంకు గ్యారంటీలు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో 15 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం.దేవుళ్ల నాయక్ మాట్లాడుతూ 1.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. జిల్లాలో 306 ఆర్బికెలకు గాను ఎ, బి, సి కేటగిరీలలో 188 ఆర్బికెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలో 47.75 లక్షల గోనె సంచులు అవసరమని, 8,86,465 గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రైస్ మిల్లర్ల సంఘం 10 లక్షల గోనె సంచుల కొనుగోలుకు అంగీకరించిందని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 1,10,473 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సరిపడా గిడ్డంగులు ఉన్నాయని వివరించారు. సీతానగరం, బలిజిపేట, పాలకొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లా సరఫరాధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, జిల్లా సహకార అధికారి బి.సన్యాసి నాయుడు, గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ వి.మహేంద్ర కుమార్, వైకెపి ఎపిడి వై.సత్యంనాయుడు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తకోట రమేష్, జిల్లా టాక్స్ అడ్వైజర్ గంటా అబ్బాయిబాబు తదితరులు పాల్గొన్నారు.