Jan 17,2021 20:30

మూతపడిన రైస్‌మిల్లు

ప్రజాశక్తి-సాలూరు : నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు చెందిన రైతులు నిలువునా మోసం పోయారు. ప్రభుత్వ అధికారుల మాటలు నమ్మి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. సుమారు రెండు కోట్ల రూపాయల ధాన్యం డబ్బులు అందకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఏడాది కాలంగా ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.
నియోజకవర్గ పరిధిలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన ధాన్యం రైతులు నిలువునా మోసపోయారు. సుమారు వందమంది రైతులు 2019 ఖరీఫ్‌ సీజన్లో సాలూరు, పెదపదం, మక్కువ, పాచిపెంట పిఎసిఎస్‌ల ద్వారా ధాన్యం ప్రభుత్వానికి విక్రయించారు. ఆ ధాన్యం మండలంలోని బాగువలస సమీపాన ఉన్న ఎంజిఆర్‌ రైసుమిల్లుకు సివిల్‌ సప్లరు అధికారులు పంపించారు. సాధారణంగా అయితే ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసిన తర్వాత యజమాని నెల, రెండు నెలల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ ఇంతవరకు మిల్లు యజమాని ఆ రైతులకు ధాన్యం డబ్బు చెల్లించలేదు. వీరిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. బ్యాంకు గ్యారంటీ ఇవ్వని ఎంజిఆర్‌ రైసుమిల్లుకి ధాన్యాన్ని అధికారులు ఆప్పగించడం వల్లే యజమాని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బ్లాక్‌ లిస్టులో ఎందుకు పెట్టలేదు
ఏడాది కాలంగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించని ధాన్యం మిల్లుని జిల్లా అధికారులు ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రెండు కోట్ల రూపాయలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న మిల్లు యాజమాన్యంపై సివిల్‌ సప్లరు అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రైసుమిల్లు మూసివేసి ఉంది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేయలేదు. కొద్దిరోజుల క్రితం ధాన్యం విక్రయించిన రైతులకు మిల్లు యజమాని అధికారుల సమక్షంలో డబ్బు చెల్లింపుపై హామీ పత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 10 నాటికి రైతుల డబ్బులు చెల్లిస్తామని మిల్లు యాజమాన్యం చెప్పినా ఇంతవరకూ అతీగతీ లేదు.
ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు
ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించడానికి ఎమ్మెల్యే రాజన్నదొర శతవిధాలా ప్రయత్నించారు. కానీ అధికారులు ఆదేశాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కి రైతుల ధాన్యం డబ్బుల చెల్లింపు గురించి ఎమ్మెల్యే రాజన్నదొర ఘాటుగానే లేఖ రాశారు. స్వయంగా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. అయినా ఫలితం లేకపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశించినా జిల్లా అధికారులు రైతులకు డబ్బులు ఇప్పించలేకపోవడం చర్చనీయాంశమైంది. మిల్లు యజమానికి ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ పీఠాధిపతి ఆశీస్సులు కూడా ఉన్నట్లు సమాచారం. గతంలో ఎంజిఆర్‌ రైసుమిల్లు వద్ద యజమాని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆయన అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే అధికారులు మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. జిల్లా అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రైతులు మున్ముందు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.