Jun 23,2021 18:15

న్యూఢిల్లీ : మరో రెండు నెలల్లో ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలకు సన్నద్ధమవుతుండగా.. ఢిల్లీ బిజెపి యూనిట్‌లో అసంతృప్తి బుసలు కొడుతోంది. వరుసగా మూడుసార్లు తమను ఢిల్లీ నాయకత్వం ఆభాసుపాలు చేసిందంటూ ఇద్దరు బిజెపి ప్రతినిధులు పేర్కొన్నారు. తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, రాష్ట్ర బిజెపి నాయకత్వం తమను పట్టించుకోవడం లేదని బిజెపి ప్రతినిధులు తాజేందర్‌ బాఘా, హరీష్‌ ఖురానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌లో 7లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను కలిగిన బాఘా.. బిజెపి ప్రతినిధి, బిజెపి కార్యకర్త, బిజెపి అభ్యర్థి హరినడర్‌ విధానసభ, వాలంటీర్‌ వంటి పార్టీ సభ్యత్వ ఆధారాలను తన హ్యాండిల్‌ బయో నుండి తొలగించారు. యువ విభాగం అధ్యక్షుని పదవికి ఎంపిక చేయకపోవడం, ప్రతినిధిగానే కొనసాగించడంతో బాఘా అసంతృప్తికి గురయ్యారని బిజెపి నేత ఒకరు తెలిపారు. మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి మదన్‌లాల్‌ ఖురానా కుమారుడైన హరీష్‌ ఖురానా కూడా పలు పార్టీ వాట్సప్‌ గ్రూప్‌ల నుండి బయటకు వచ్చారని అన్నారు. ఖురానా ఆఫీస్‌ బేరర్‌ పదవికి తీసుకోవాలని కోరారని.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ను కూడా కోరారని, అయితే పార్టీ తిరస్కరించడంతో అసంతృప్తికి గురయ్యారని అన్నారు. అసంతృప్తికి గురైన వారంతా మాజీ ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్‌ తివారికి చెందినవారని, వారికి పదవులు ఇవ్వకపోవడంతో ఇలా జరిగిందని సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.