Oct 17,2020 21:22

షార్జా : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 179 పరుగులు చేసి ప్రత్యర్థి జట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని విధించింది. డుప్లెసిస్‌ 58 (47 బంతులు : 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు చివరలో అంబటి రాయుడు (45 నాటౌట్‌ : 25 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (33 నాటౌట్‌ : 4 సిక్స్‌లు) చెలరేగడంతో చెన్నై భారీ స్కోర్‌ నమోదు చేయగలిగింది. షేన్‌ వాట్సన్‌ 36 (28 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ఎన్రిచ్‌ నోర్జే 2 వికెట్లు తీయగా దేశ్‌పాండే, రబడ చెరో వికెట్‌ పడగొట్టారు.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ శామ్‌ కరన్‌ (0) తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో ఎన్రిచ్‌ నోర్జే చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కగిసో రబడ అద్భుత బంతులు సంధించడంతో రెండో ఓవర్‌ మెయిడెన్‌గా నమోదైంది. దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్‌లో షేన్‌ వాట్సన్‌ రెండు ఫోర్లు బాడదంతో ఆ ఓవర్‌లో మొత్తం పది పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బంతులేసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. నోర్జే వేసిన ఐదో ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో ఆ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. రబడ వేసిన ఆరో ఓవర్‌లో డుప్లెసిస్‌, వాట్సన్‌ చెరో బౌండరీ బాది పది పరుగులు తీశారు. కట్టుదిట్టమైన బంతులు వేసిన అక్షర్‌ పటేల్‌ ఏడో ఓవర్‌లో నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చారు. అక్షర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో వాట్సన్‌ ఫోర్‌ కొట్టడంతో పాటు తొమ్మిది పరుగులు రాబట్టారు. అశ్విన్‌ వేసిన పదో ఓవర్‌లో డుప్లెసిస్‌ ఒకటి, వాట్సన్‌ రెండు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.
డుప్లెసిస్‌ అర్ధసెంచరీ!
దేశ్‌పాండే వేసిన 11వ ఓవర్‌లో తొలి బంతిని డుప్లెసిస్‌ సిక్స్‌, ఫోర్‌, డబుల్‌ తీయడంతో ఆ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. నోర్జే వేసిన 12వ ఓవర్‌లో డుప్లెసిస్‌ సింగిల్‌ తీయడంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతికి షేన్‌ వాట్సన్‌ 36 (28) పరుగులు వద్ద క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆ ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. అక్షర్‌ వేసిన 13వ ఓవర్లో ఏడు పరుగులు రాగా, అశ్విన్‌ వేసిన 14వ ఓవర్‌లో రాయుడు సిక్స్‌, రెండు డబుల్స్‌ తీయడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. రబడ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతిని ఫోర్‌ బాదిన డుప్లెసిస్‌ 58 (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగుల వద్ద ధావన్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు.
చెలరేగిపోయిన రాయుడు, జడేజా! చివరి 30 బంతుల్లో 67 పరుగులు!
స్టోయినీస్‌ వేసిన 16వ ఓవర్‌లో రాయుడు భారీ సిక్స్‌ బాదడంతో పాటు ఆ ఓవర్‌లో పది పరుగులు రాబట్టారు. నోర్జే వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతిని రాయుడు సిక్స్‌ బాదగా.. మూడో బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఎంఎస్‌ ధోనీ (3) క్యారీ చేతికి చిక్కి ఔటయ్యాడు. చివరి బంతికి రాయుడు ఫోర్‌ కొట్టడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్‌లో రవీంద్ర జడేజా భారీ సిక్స్‌ బాదడంతో బంతి స్టేడియం బయట పడింది. చివరి బంతికి డబుల్‌ తీయడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. రబడ వేసిన 19వ ఓవర్‌లో రాయుడు, జడేజా చెరో సిక్స్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు రాబట్టారు. నోర్జే వేసిన చివరి ఓవర్‌లో జడేజా రెండు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లోనూ మొత్తం 16 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి చెన్నై 179 పరుగులు చేసింది.