May 14,2022 07:27
  • కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఘటన..
  • రంగంలోకి దిగిన అగ్నిమాపక శకటాలు..

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభంచింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భవనం కిటికీలు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగింది..?
నిత్యం రద్దీగా ఉంటే వాణిజ్య సముదాయంలో ఉన్న షాపుల్లో యజమానులు, సిబ్బందితో పాటు సందర్శకులు ఉన్నారు. ఎప్పటి లానే శుక్రవారం వ్యాపారాలు కొనసాగుతుండటంతో..అమాంతంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు..చిమ్మచీకట్లు..పొగలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడటానికి చేసిన కొందరి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ మంటల్లోనే సజీవ సమాధి అయ్యారు. భవనం కిటికీల నుంచి పొగలు రావడంతో జేసీబీ యంత్రంతో మరికొందర్ని కిందకు దించారు. ఇంకొందరు తాడుతో కిందకు దిగారు. ప్రస్తుతం తొమ్మిది అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో పాటు క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లను కూడా అక్కడికక్కడే ఏర్పాటు చేశారు.

భవన సముదాయ యజమాని అరెస్టు..!
మెట్రో స్టేషన్‌లోని పిల్లర్‌ 544 సమీపంలో నిర్మించిన ఈ భవనం 3-అంతస్తుల వాణిజ్య భవనం అని, దీనిని కార్యాలయ స్థలంగా కంపెనీలకు అద్దెకు ఇస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా, రూటర్‌ తయారీ కంపెనీ ఉన్న భవనంలోని మొదటి అంతస్తు నుంచి మంటలు చెలరేగాయని పోలీసులు గుర్తించారు. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.