
* 180 జిల్లాల స్కోర్ 10శాతం లోపే : పిజిఐ-డి నివేదిక
* కేరళ, తమిళనాడు, పంజాబ్..డిజిటల్ విద్యలో ముందంజ
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ సమయాన మోడీ సర్కార్ తీసుకున్న కఠిన లాక్డౌన్ నిర్ణయం, కరోనా ఆంక్షలు విద్యార్థులపాలిట శాపంగా మారాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ విద్య అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధ్యయనం చేయగా, 180 జిల్లాల్లో పాఠశాలల పనితీరుకు సంబంధించిన స్కోర్ 10శాతం కూడా దాటలేదు. 146 జిల్లాలు 11 నుంచి 20శాతం మధ్య స్కోరింగ్ సాధించాయి. 21-30శాతం మధ్య స్కోరింగ్ చేసినవి 125 జిల్లాలున్నాయని 'పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్స్' (పీజీఐ-డీ) నివేదిక వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో డిజిటల్ విద్య ఏమేరకు అమలైంది? అన్నదానిపై కేంద్ర విద్యాశాఖ ఇటీవల పరిశోధన జరిపింది. దీనికి సంబంధించి రూపొందించిన 'పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్స్' (పీజీఐ-డీ) నివేదికలో కీలక విషయాలు బయటకొచ్చాయి. డిజిటల్ విద్యను అమలుజేయటంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య తేడా గణనీయంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఉదాహరణకు, చండీగఢ్, ఢిల్లీ లాంటి చోట్ల పాఠశాలలు 50 స్కోర్‌కు...వరుసగా 25, 35 సాధించాయి. బీహార్‌లోని ఆరారియా, కిషన్‌గంజ్ ప్రాంతాల్లో కేవలం 2 మాత్రమే నమోదైంది. ఇక అసోంలో వెనుకబడిన జిల్లాలు దక్షిణ సాల్మారా, మంక్చార్, త్రిపురలో ధలాల్లో స్కోర్ 1 మాత్రమే. పీజీఐ సూచికను కేంద్రం రాష్ట్రాలవారీగా విడుదల చేసింది. ఇందులో కేరళ, పంజాబ్, చండీగఢ్, తమిళనాడు అగ్రస్థానాల్లో నిలిచాయి. .కరోనా సంక్షోభ సమయంలో (2019-20-జూన్ 2021) దేశవ్యాప్తంగా స్కూల్స్ డిజిటల్ విద్యను అమలుజేయటంలో దారుణంగా విఫలమయ్యాయి. కారణం స్కూల్స్‌లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, సాంకేతికతను టీచర్లు ఉపయోగించుకునే పరిస్థితులు లేకపోవటమే. దాంతో ఆయా పాఠశాలల పనితీరు గణనీయంగా దెబ్బతిన్నది. విద్యారంగ నిపుణుల్ని, ఆయా రాష్ట్రాల్ని సంప్రదించకుండానే 'డిజిటల్ విద్య'కు కేంద్రం ఆమోదముద్ర వేయటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంటర్నెట్ సౌకర్యాలు, కంప్యూటర్లు, సాంకేతికతను టీచర్లు ఎంత వరకు ఉపయోగించగలరు? అనేవి పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా 'డిజిటల్ విద్య'ను తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు నష్టపోయారు.