May 26,2023 22:06
  • నేడు ఉదయం 10.30 గంటలకు సిబిఐ వాదనలు

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపి అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ సుమారు ఏడు గంటలసేపు విచారణ జరిపారు. అవినాష్‌ రెడ్డి తరుఫున సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు, వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తరుపున రవిచంద్‌ వాదనలు వినిపించారు. అప్పటికే కోర్టు సమయం ముగియడంతో శనివారం ఉదయం 10.30 గంటలకు సిబిఐ వాదనలు వింటామంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.
దీనికి మందు అవినాష్‌ తరుఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, 'ఎంతో నమ్మకంతో ఈ కేసు విచారణను కోర్టు సిబిఐకి అప్పగించింది. దాన్ని సిబిఐ నిలుపుకోలేకపోయింది. 2020 నుండి సిబిఐ దర్యాప్తు చేస్తూనే ఉంది. అనుమానితులందరూ వైసిపికి చెందిన వారే. ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఫోన్‌ కాల్స్‌ సర్వసాధారణం. వీటిని ఆధారంగా చూపించి అవినాష్‌రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఈ కేసులో 2020 సెప్టెంబర్‌ తొమ్మిదిన సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 2019 మార్చి 28న గంగిరెడ్డిని అరెస్ట్‌ చేసింది. 2021 జూన్‌ పదిన ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తర్వాత సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరిలను సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఈ నలుగురు నిందితులు వివేకాను హత్య చేశారు. వివేకా మృతి చెందిన రోజే ఐపిసి 201 కింద కేసు నమోదైంది. కానీ, సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 201 సెక్షన్‌ లేదు. దస్తగిరికి ముందస్తు బెయిల్‌కు సిబిఐ ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు' అని పేర్కొన్నారు. సునీత తరుఫు న్యాయవాది రవిచంద్‌ వాదనలు వినిపిస్తూ, 'వివేకా హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయాడని, రక్తపు వాంతులతో మృతి చెందాడని ఎలా చెప్పారు. ఇందులో కుట్ర దాగి ఉంది. గంగిరెడ్డి హాస్పిటల్‌ నుండి వచ్చిన రాజారెడ్డి... వివేకాకు కుట్లు వేశారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు అక్కడే ఉన్నారు. అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చినప్పుడల్లా తప్పించుకుంటున్నారు. అవినాష్‌ తల్లి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రిలోకి ఎవరినీ వెళ్లనీయకుండా ఆస్పత్రి ముందు అవినాష్‌ అనుచరులు టెంట్‌ వేసుకొని కూర్చున్నారు. అవినాష్‌రెడ్డి ప్రభావిత వ్యక్తి అని చెప్పడానికి కర్నూలు హాస్పిటల్‌ ఘటన ఒక ఉదాహరణ' అని న్యాయమూర్తికి వివరించారు. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న నలుగురు నిందితులను చూశారు కాబట్టి కేసు విచారణకు ఆయన స్టేట్‌మెంట్‌ కీలకమని న్యాయవాది పేర్కొన్నారు. అప్పటికే కోర్టు సమయం ముగిసింది.

  • అవినాష్‌రెడ్డి తల్లిని హైదరాబాద్‌ తరలింపు

అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఎఐజి)కి శుక్రవారం సాయంత్రం తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అవినాష్‌రెడ్డి కూడా ఆమె వెంటే ఉన్నారు.

  • భాస్కర్‌రెడ్డికి అస్వస్థత

వివేకా హత్య కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. బిపి పెరగడంతో వెంటనే ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం కుదురుపడిన అనంతరం జైలుకు మళ్లీ తీసుకెళ్లారు.