అండగా నిలిచేవారికే మా మద్దతు- విభిన్న ప్రతిభావంతులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ డిమాండ్లు నెరవేర్చి, అండగా నిలిచిన వారికే రాజకీయంగా తమ మద్దతు ఉంటుందని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుణశేఖర్‌ తెలియజేశారు. రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల ఆత్మీయ సమావేశం ఆదివారం న్యూ ఆంధ్ర కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్బంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ తమకు ఏ ప్రభుత్వంనూ సరైన న్యాయం జరగడం లేదన్నారు. వికలాంగులకు రాజకీయ శూన్యత ఏర్పడిందని తెలిపారు. సమాజంలో అందరికంటే వెనుకబడిన సమాజం వికలాంగుల సమాజమని అన్నారు. విక లాంగులకు రూ 6 వేలు పింఛన్‌, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అంత్యోదయ స్కీం ద్వారా రేషన్‌ కార్డులు అందించాలని, ప్రభు త్వం అందించే సంక్షేమ పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, 2016 చట్టం ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. పిడబ్ల్యుడి ఫెడరేషన్‌ ఉపాధ్య క్షులు మురళి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరైతే వికలాంగులకు సరైన మేనిఫెస్టో ఏర్పాటు చేస్తారో వారికి తాము అండగా ఉంటామని అన్నారు. రాజంపేట ఉపాధ్యక్షులు అబ్దుల్‌ ఖాదర్‌ మాట్లాడుతూ వికలాంగులకు విద్యా అవకాశాలు కల్పించాలని, వికలాంగులు కార్పొరేషన్‌ ద్వారా లోన్లు, బడ్జెట్లలో రిజర్వేషన్‌ ప్రకారం 5(ఐదు) శాతం బడ్జెట్‌ కేటాయించాలని పేర్కొన్నారు. జాతీయ క్రీడాకారుడు శివకోటి మాట్లాడుతూ పారా స్పోర్ట్స్‌ వికలాంగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని, సరైన బడ్జెట్‌ కల్పించాలని, ప్రోత్సాహకాలు అందించాలని, సాధారణ క్రీడాకారులకు అందించే రిజర్వేషన్ను వర్తింపచేయాలని కోరారు. ఈ ఆత్మీయ సమావేశంలో పుల్లంపేట మండలం అధ్యక్షులు మల్లు సుబ్బనరసా రెడ్డి, పెనగలూరు అధ్యక్షులు తిరుపాల్‌, ఒంటిమిట్ట అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, గౌరవాధ్యక్షులు తిరుమల్‌ రెడ్డి, రెహమాన్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️