అడ్డగోలుగా అనధికార భవన నిర్మాణాలు

Mar 31,2024 21:10

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : పట్టణంలో అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు అడ్డగోలుగా సాగిపోతున్నాయి. ప్రైవేట్‌ లైసెన్స్‌ సర్వేయర్ల దృష్టిలో పెట్టకుండా, వారి అధ్వర్యంలో లైసెన్స్‌లు పొందకుండా, టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నిబంధనలతో సంబంధం లేకుండా భవన యజమానులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా మీరు ఎంచక్కా కట్టుకోండి మేము తర్వాత నోటీసులిస్తామన్న చందంగా ఉంది స్థానిక మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు, కార్యదర్శుల పరిస్థితి.గ్రేడ్‌-1 మున్సిపాలిటీగా ఉన్న పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత అనధికార, అక్రమ నిర్మాణాలను భవన యజమానులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అయితే వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మిన్న కుండిపోవడంతో భవన యజమానులు తమ పనులను తొందరగానే పూర్తి చేసి సున్నాలు వేసి గృహ ప్రవేశాలు కూడా చేస్తూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరికొందరు అనుమతులు తీసుకోకుండానే భవన నిర్మానాలు చేస్తున్నారు. ఇంకొందరు నిర్మాణ అనుమతులు నామ మాత్రంగా తీసుకొని భవన నిర్మాణాలను నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు బైపాస్‌ రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయం రహదారి, ఎస్‌ ఎన్‌ ఎం నగర్‌తో పాటు స్థానిక ప్రజల రాకపోకలు ఎక్కువగా సాగించే పలు వార్డుల్లో గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకొని దర్జాగా వ్యాపార, వాణిజ్య భవన నిర్మాణాలను చేపడుతున్నారు. షాపులకు షట్టర్లు కూడా బిగిస్తున్నా, ఆయా వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు కనీస బాధ్యతతో పర్యవేక్షణ చేయడం లేదు. దీంతో యజమానులు యథేచ్ఛగా నిర్మాణాలను కొనసాగిస్తున్నా, భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత నోటీసులు ఇస్తూ చేతులుదులుపుకునేలా మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి అనధికార, అక్రమ నిర్మాణాల వల్ల ఆయా ప్రాంతాల్లో పార్కింగ్‌తో పాటు ట్రాఫిక్‌, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార, వాణిజ్యాల కోసం భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటే ప్లాన్‌లో వాహనాల పార్కింగ్‌ కు స్థలం చూపించాల్సి ఉంది. దీంతోపాటు భవిష్యత్తులో రోడ్ల విస్తీర్ణం పనులకు అవసరమైన ఖాళీ స్థలాన్ని మున్సిపల్‌ కార్యాలయానికి రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది. అవేవీ పాటించకుండా పార్కింగ్‌ స్థలాలను సైతం వదలకుండా నిర్మాణాలను చేపట్టడానికి గృహ నిర్మాణాల అనుమతులను పొందుతున్నారు. నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత ఆ షాపులకు షట్టర్‌ బిగించి వేలాది రూపాయలు అద్దెలకు ఇచ్చి లాభం పొందుతున్నారు. ఆ షాపులకు వచ్చేవారికి పార్కింగ్‌ సౌకర్యం లేక షాపు ముందు ఉన్న రహదారిపైనే ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలమవుతుంది. ఇంత జరుగుతున్నా అలాంటి నిర్మాణాలకు పన్నులు వేసే క్రమంలో అధికారులు మిన్నకుండి పోవడంతో మున్సిపల్‌ ఆదాయానికి గంండి పడుతుంది. తాజాగా పట్టణంలోని నాయుడు వీధి ముందు ఉన్న పురాతన భవనం దిశ మార్చి మూడు అడుగులు ముందుకు వచ్చి వాణిజ్య దుకాణాలుగా నిర్మాణం చేసి అద్దెలకు ఇచ్చినప్పటికీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆ భవన నిర్మాణ యజమానికి నోటీసులతో సరిపెట్టుకున్నారు. దీంతో పాటు పాత బస్టాండ్‌ రోడ్డులో ఎస్‌ఎన్‌ఎం నగర్‌ ముందు ఉన్న ఖాళీ స్థలానికి కొందరు వ్యక్తులు నివాస గృహానికి అనుమతులు తీసుకుని ఏకంగా ఎనిమిది వాణిజ్య సముదాయాలను నిర్మించారు. దీంతోపాటు ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో ఉన్న సాయిబాబా మందిరానికి ఆనుకొని ఒక వ్యక్తి జి ప్లస్‌ టు భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని రెండు స్లాబ్‌లు వేసి నిబంధనలకు వ్యతిరేకంగా అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. వీటితో పాటు పలు వార్డుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనధికార నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మరికొందరు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నో అనధికార, అక్రమ నిర్మాణాలు చేస్తూ మున్సిపల్‌ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ పరిధిలో ఇలాంటి అనధికార అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని గుర్తించి మున్సిపాల్టీకి ఆదాయ రూపంలో రావాల్సిన ఫీజులను చెల్లించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సచివాలయాల ప్లానింగ్‌ సెక్రటరీలు చర్యలు చేపడతారో, లేదో చూడాలి.

➡️