‘అనవసర ఆరోపణలతో అబాసుపాలు కావొద్దు’

సాయి బాలాజీ వెంచర్‌ మ్యాప్‌ చూపిస్తూ వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

పల్నాడు జిల్లా: తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు తనపై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు.నరసరావుపేట మండలంలోని వినుకొండ రోడ్డులో ఉప్పలపాడు గ్రామ సమీపంలో గల సాయి బాలాజీ వెంచర్‌ లో మొత్తం 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అదే భూమిలో రైతులు పొలం వెళ్లే బాట ఆక్రమించానని అరవిందబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. స్థానిక గుంటూరు రోడ్డులోని వైసిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయి బాలాజీ వెంచర్‌ లో ఆక్రమించానని డాక్టర్‌ చదలవాడ చెబుతున్న భూమిని చూపిస్తే తనకే రాసిస్తానని రైతులు పొలం వెళ్లే బాట ఆక్ర మించానని ఆరోపిస్తున్న బాటకు ఏర్పాటు చేసిన వెంచర్‌ కు అసలు సంబంధం లేదని వెంచర్‌ కు సమీపంలో బాట ఉందో లేదో చూడకుండా అసత్య ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చదలవాడ చెప్పిన సర్వే నెంబర్లకు సాయి బాలాజీ వెంచర్‌ లోని భూములకు ఎటువంటి సంబంధం లేదని సాయి బాలాజీ వెంచర్‌ ఏర్పాటుకు భూములు కొనుగోలు చేసిన రైతుల వివరాలను వెల్ల డించారు. అరవిందబాబు ఆరోపిస్తున్న సర్వే నంబర్లలో గల భూములు రైతులకు చెందినవని, ఆ భూములను సంబంధిత రైతుల ఆధీనంలో ఉన్నాయని వెల్లడించారు. అరవిందబాబు తన అనుయాయుల మాటలు విని అనవసరంగా అభాసుపాలు కావొద్దని, ఆరోపణలు చేసే ముందు తగిన ఆధారాలు ఉండాలని హితవు పలికారు. ఏ ప్రభుత్వ భూమిని కానీ, ఏ వ్యక్తుల భూమి కానీ ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు. నిత్యం అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చదలవాడ చూస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు నరసరావుపేట టిడిపి అసెంబ్లీ అభ్యర్థి గా ఇంకా అధిష్టానం ప్రకటించక ముందే తాను ఎమ్మెల్యే అయినట్లు అరవిందబాబు కలలు కంటు న్నారని ఎద్దేవా చేశారు.

➡️