అనుమతులిస్తే ఆందోళన తప్పదు

Feb 13,2024 20:45

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని కొమిరి వెంకటాపురం గ్రామ సమీపం నాగావళి నదిలో ఇసుక ర్యాంపు నిర్వహణకు అధికారులు అనుమతులు ఇస్తే ధర్నాలు తప్పవని కొమిరి, వెంకటాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో గ్రామాల రామ మందిరంలో గ్రామ పెద్దలు యువతతో ఇసుక ర్యాంపు వద్దంటూ చర్చలు జరిపారు. ఇక్కడ ఇసుక ర్యాంపు నిర్వహణ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనని గ్రామస్తులు వాపోయారు. ఇసుక ర్యాంపు వల్ల గ్రామంలో సిసి రోడ్లు, తాగునీటి కుళాయిలు, ఇతర ప్రభుత్వ కాలువ కల్వర్టులు శిధిలమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఉమ్మడి శ్రీకాకుళంలో అప్పటి అధికారులు ఇసుక ర్యాంప్‌ పై విచారణ చేయకుండా అనుమతులు ఇవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. కొమిరి వెంకటాపురం ఇసుక ర్యాంపు వల్ల గ్రామాల్లో ఉన్న సిసి రోడ్లు మలుపులు, ఎన్నో గృహాలు దెబ్బ తిన్నాయని గుర్తు చేశారు. గ్రామస్తులమంతా ఇసుక ర్యాంపు వద్దంటూ ధర్నాలు చేశామని, పోలీస్‌, జిల్లా, డివిజన్‌ అధికారులు వచ్చి పరిశీలించారని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించారని తెలిపారు. అయినప్పటికీ కొంత మంది అనుమతులు ఉన్నాయని చెబుతూ దౌర్జన్యంగా ర్యాంపు నిర్వహణ చేపట్టారని వీధుల్లో ఇసుక ట్రాక్టర్లు, లారీలు రాకుండా నిలుపుదల చేశామని చెప్పారు. ఇప్పుడు మరలా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇక్కడ మరోసారి ఇసుక ర్యాంపు నిర్వహణకు ఆదివారం ఆగమేఘాల మీద ఆర్‌డిఒ బొడ్డేపల్లి శాంతి, డిఎస్‌పి మోహనరావు, మైన్స్‌ అధికారులు పరిశీలించడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు ఇదేమి చోద్యమని నివ్వెర పోయారు. ఒకే చోటకి చేరుకొని ఇసుక ర్యాంపు వద్దంటూ తీర్మానం చేసుకున్నారు. దిక్కరిస్తే పోరాటాలకు సిద్ధమని, వీధుల్లో నుంచి రానివ్వమని ముక్తకంఠంగా ఏకమయ్యారు. ర్యాంపు నిర్వహణకు వైసిపి నాయకులు కంకణం కట్టుకున్నారని ఇసుక ర్యాంపు నిర్వహణ చేస్తే ఖబడ్దారని హెచ్చరించారు.

➡️