అలకబూనిన గ్రూపులను ఏకం చేసేనా?

Feb 13,2024 21:40

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : నువ్వాదరిని ….నేనీదరిని… అన్న చందంగా ఉంది నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి. నాయకుల మధ్య అనైక్యత పార్టీ కార్యకర్తలను, ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. నియోజకవర్గంలో టిడిపి ఆదరణ ఉన్నా, నాయకుల మధ్య అనైక్యత రానున్న ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి ఆటంకాలుగా మారనున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన విజయచంద్ర సీనియర్‌ నాయకులను, కార్యకర్తలను కలుపుకోపోలేకపోతున్నారన్న అపోహ ప్రజల్లో ఉంది. విభేదాలను పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కలిసికట్టుగా పనిచేయకపోవడంతో నియోజకవర్గం లోని బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం అర్బన్‌, రూరల్‌లో ఉన్న టిడిపి కార్యకర్తలు, అభిమానులు సానుభూతిపరులు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ధీటుగా పనిచేసేందుకు విభేదాలను మరచి నాయకులంతా ఒక్కటిగా నిలవాలనే సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకోగలిగినట్లయితే 2014లో టిడిపి విజయం ఖాయమని కార్యకర్తలు ఘంటాపదంగా చెబుతున్నాయి. ఈ పరిస్థితులపై బుధవారం పార్వతీపురంలో జరగనున్న శంఖారావం సభకు విచ్చేయనున్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ నాయకుల మధ్య ఐక్యత కల్పించినట్లయితే నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడం ఖాయమని పార్టీ అభిమానులు చెబుతున్నారు. అయితే నారా లోకేష్‌ ఎడమొహం, పెడమొహంగా ఉన్న నాయకులను ఏ మేరకు కలుపుతారోనని తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు, ఎదురుచూస్తున్నారు.శంఖారావం సభకు భారీ ఎత్తున పాల్గొనాలి : టిడిపి సీతాగరం : పార్వతీపురంలో బుధవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో జరగనున్న శంఖారావం సభకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మండల టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సాలహరి ఇంటి వద్ద సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శంఖారావం సభకు కార్యకర్తలను, అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లపై చర్చించారు. పెద్దఎత్తున టిడిపి, జనసేన శ్రేణులను తరలి వచ్చేలా దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల అధ్యక్షులు పెంట సత్యం నాయుడు, సాలహరి గోపాల్‌, రౌతు వేణుగోపాల నాయుడు, రెడ్డి సింహాచలంనాయుడు, బొమ్మినాయిని లక్ష్మణ, బుడితి శ్రీను, సబ్బాన శ్రీను, సోమిరెడ్డి రమేష్‌, గొట్టాపు అప్పారావు, తేరేజమ్మ, గరికయ్య, వాకాడ పారినాయుడు, పోల తిరుపతిరావు, తెంటు రామారావు, బలగ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️