అవ్వా..తాతల నిరీక్షణ..!

Apr 1,2024 21:46
అవ్వా..తాతల నిరీక్షణ..!

పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వృద్ధులు
అవ్వా..తాతల నిరీక్షణ..!
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి పంపిణీ చేసే పింఛన్‌ కోసం సోమవారం ఉదయం నుంచి జిల్లా వ్యాపితంగా అవ్వా, తాతలు ఎదురుచూశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇసి వలంటీర్ల ద్వార పంపణీని నిలుపుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అనేక మంది ఈ విషయం తెలియకపోవడంతో పింఛన్‌ కోసం చూశారు. రేపటి నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది ద్వార కేంద్రాల వద్దే పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వేళ సచివాలయం రాలేని వారికి ఇంటికి వెళ్లి అందజేస్తారు. ఎన్నికల నేపథ్యంలో అధికారపార్టీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు పింఛన్‌ నిలుపుదల చేశారని, జగన్‌ ఇవ్వాలని చూశారని పింఛన్‌ దారుల్లో మార్కులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాపితంగా ప్రతి నెలా 3.19 లక్షల మందికి రూ.95.77 కోట్లు పంపిణీ చేస్తున్నారు. సొమవారం ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు.అవ్వా, తాతల పింఛన్లలో ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేయాలి. సాధారణంగా జరిగే సంక్షేమ కార్యక్రమాలు నిలుపుదల చేయరు. దీనిని అధికారపార్టీ వివాదం చేస్తుంది. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులా? వైసిపి కార్యకర్తలా? ఇప్పటికీ స్పష్టం కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సిద్ధం సభలో ” వలంటీర్లు మన కార్యకర్తలు, రేపు ఎన్నికల్లో అవ్వా తాతలను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయించాలి” అని చెప్పారు.. ఓ సభలో ”ఎంపి విజయసాయిరెడ్డి రాష్ట్రంలో వలంటీరులందరూ మనపార్టీ కార్యకర్తలే. వారు ఎన్నికల్లో ఉపయోగపడాలి” అని ప్రకటించారు. వలంటీర్ల ఉద్యోగాలు గ్రామీణ ప్రాంత వైసిపి నేతల సిఫార్సులతో ఎంఎల్‌ఎల ఆదేశాలతో ఎంపిక చేశారు. ఇది జగమెరిగిన సత్యం. వలంటీర్లు ప్రజా స్వామ్యయుతంగా ఎన్నికల్లో పనిచేస్తారో లేదో చూడాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి నెలా ఒకటో తేదీ ఇంటింటికి వెళ్లి వలంటీర్లు పంపిణీ చేసే పింఛన్ల నిలుపుదల చేసింది. 3వతేదీ సచివాలయ సిబ్బంది ద్వార పింఛన్లు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పింఛన్ల దారులు నేరుగా సచివాలయలకు వెళ్లి అక్కడ పెన్షన్‌ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఓవేళ నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఈనెలా 5 వతేదీ ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలోని పంచాయతీ సెక్రటరీ అకౌంట్‌కు నగదు బదిలీ చేస్తారు. నగదు డ్రా చేసి పంపిణీ చేస్తారు. పంపిణీ ఆలస్యమవుతుంది తప్ప, ఆగిపోదు. దీనిని అధికారపార్టీ రాజకీయం చేయడానికి సిద్ధమైంది.టిడిపి నేత చంద్రబాబునాయుడు పింఛన్‌ నిలిపేయాలని ఇసిని కోరి ఇలా చేశారని, జగనన్న వస్తేనే మీకు పింఛన్‌ ఒకటో తేదీ వస్తుందని సోమవారం ఉదయం నుంచి విస్తృతంగా ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధిపొందడానికి చూస్తున్నారు. 3.19 లక్షల మందికి రూ.95.77 కోట్లు..!రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ జిల్లా వ్యాపితంగా 3,19,961 మందికి వివిధ రకాల పింఛన్లు రూ.95 కోట్లా, 77 లక్షలా 58 వేలు పంపిణీ చేస్తుంది. వలంటీర్లు ముందురోజు నగదు డ్రా చేసుకొని ప్రతి ఇంటికీ వెళ్లి ఉదయం చేర్చుతున్నారు. వృద్ధాప్య పింఛన్‌ 1.73 లక్షల మందికి రూ.5.19 కోట్లు, వితంతువులు 74,547 మందికి రూ.2.23 కోట్లు, వికలాంగులు 33,489 మందికి రూ.కోటి, చేనేత కార్మికులు 3,246 మందికి రూ.97 లక్షలు వీరితో పాటు మత్స్యకారులు, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్‌, కళాకారులు, సైనిక్‌ వెల్పెర్‌ పెన్షనర్స్‌, అభయ హస్తం, ఆరోగ్య పింఛన్‌ హెఐవి పెన్షన్‌ మొత్తం అందజేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ 85 నుంచి 90 శాతం, రెండో రోజు 95 శాతం, ఐదోరోజు 98 శాతం పంపిణీ జరుగుతోంది. ఈ మొత్తం ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అపోహలు, అధైర్య పడవద్దని రేపటి నుంచి పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు. సచివాలయం వద్దకు వస్తే, ఇస్తారని, లేదంటే సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు, ఇసి ఆదేశాలతోనే ఇలా సాగుతుందన్నారు.

➡️