అసంపూర్తిగా భవన నిర్మాణాలు

Feb 11,2024 20:01

  ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి   :  ప్రభుత్వం ప్రాధాన్యతా పనులుగా భావించిన భవన నిర్మాణాలు చాలా వరకు అసంపూర్తిగాను, పునాదుల స్థాయిలోనూ ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా విడుదల చేయాల్సిన నిధులు మంజూరు చేయకపోవడం, నిధులు రాబట్టుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతకవైఖరి ప్రదర్శించడమే ఇందుకు ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. చేసిన పనులకుగాను విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం రూ.28కోట్ల మేర బకాయి రావాల్సివుంది. అటు పార్వతీపురం మన్యం జిల్లాలోనూ రూ.10కోట్ల వరకు విడుదల కావాల్పి వున్నట్టు సమాచారం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా ఏటా చేపడుతున్న పనిదినాలు, వాటిపై విడుదల అవుతున్న నిధులపై కొంతశాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులకు కేటాయించాల్సి ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు వంటి వ్యవస్థలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో ఆయా భవనాలు నిర్మాణానికి మొదటి ప్రాధాన్యతగాను, రోడ్లకు రెండో ప్రాధాన్యతగాను ఖర్చుచేసేందుకు నిర్ణయించింది. రెండో ప్రాధాన్యతకు పెద్దగా నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామీణ రహదారులు అస్తవ్యస్థంగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ సచివాలయాలు ఉండగా వీటిలో 498 సచివాలయ భవనాలు, 496 రైతు భరోసా కేంద్రాలకుగాను 291 భవనాలు, 311 వెల్‌నెస్‌ సెంటర్లకుగాను 178 పూర్తి భవనాలు నిర్మించాలని 2019లోనే ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. ఉపాధి కూలీలు చేస్తున్న పని, వాటికి చెల్లింపులను బట్టి విజయనగరం జిల్లాలో సుమారు రూ.300కోట్లకుపైగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధులు విడుదల చేయాలి. కానీ, అరకొరగా విడుదల చేయడం వల్ల మిగిలిన నిధులు రద్దుకావడంతోపాటు చేసిన పనులకు బిల్లులు రాక, సంబంధిత భవన నిర్మాణాల కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పై లెక్కలను బట్టి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రూ.1500కోట్ల మేర విడుదల చేయాల్సి వున్నప్పటికీ, గ్రామ సచివాలయాలకు రూ.130కోట్లు, రైతు భరోసా కేంద్రాలకు రూ.60కోట్లు, విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌ భవనాలకు రూ.50కోట్ల చొప్పున కేవలం రూ.240కోట్లు మాత్రమే విడుదల చేసింది. వీటికి సంబంధించి రూ.28కోట్ల మేర బకాయి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం పనులు పూర్తికావాలంటే మరో రూ.100కోట్ల వరకు అవసరమని సమాచారం. దీంతో, 123 గ్రామ సచివాలయాలు, 126 రైతు భరోసా కేంద్రాలు, 133 విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌లు చొప్పున మొత్తం 382 భవన నిర్మాణాలు రూప్‌లెవెల్‌, గోడలు, పునాదుల స్థాయిలో నిలిచిపోయాయి. చాలా వరకు ఏళ్ల తరబడి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. మరో 32 గ్రామ సచివాలయాలు, 79ఆర్‌బికెలు, 124 విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌ల చొప్పున ఈ మూడు విభాగాలకు చెందిన 235 భవనాలకు కనీసం ప్రతిపాదనలు కూడా లేవు. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా 311 గ్రామ సచివాలయ భవనాలకు గానూ, 253భవనాల పనులు ప్రారంభించగా, 125 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 301 ఆర్‌బికె భవనాలకు గాను, 178 నిర్మాణాలు చేపట్టగా, 100 మాత్రమే పూర్తయ్యాయి. 192 విలేజ్‌ క్లీనిక్‌ భవన సముదాయాలు చేపట్టగా ఇందులో చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. మొత్తం భవన నిర్మాణాలకు సంబంధించి రూ.10కోట్ల వరకు బకాయి ప్రభుత్వం నుంచి రావాల్సివున్నట్టు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో సచివాలయ, ఆర్‌బికె, విలేజేజ్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాల బకాయిలు సంక్రాంతిలోపే చెల్లిస్తామని, పనులు ముమ్మరం చేయాలంటూ జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు హామీ ఇచ్చినప్పటికీ, ఆ మాట ప్రకారం నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు.

➡️