ఆందోళనొద్దు.. నీటిని కాచి తాగండి

Feb 13,2024 00:18

జిజిహెచ్‌ నుండి డిశ్ఛార్జి అయిన మహిళతో మాట్లాడుతున్న కమిషనర్‌, ఇతర అధికారులు
ప్రజాశక్తి-గుంటూరు : నగర ప్రజలు తాగునీరు సమయంలో వచ్చే నీటిని కాచి, చల్లార్చి వినియోగించుకోవాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి చెప్పారు. కమిషనర్‌ సోమవారం ఉదయం 6 గంటలకు క్షేత్ర స్థాయి పర్యటనలో పొన్నూరు రోడ్డులోని భారహిమం పంజా, పకీర్‌గూడెం ప్రాంతాల్లో కార్పొరేటర్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో కలసి పర్యటించి, తాగునీటిలో క్లోరిన్‌ శాతాన్ని పరిశీలించారు. అదే ప్రాంతంలో అనారోగ్యానికి గురై జిజిహెచ్‌లో చేరిన, జిజిహెచ్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన బాధిత కుటుంబాలను సందర్శించి ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్శించిన 18 గృహాల్లో ఎంతమంది నివశిస్తున్నదీ, ఎంతమంది అనారోగ్యంకి గురైనది, అందులోని కారణాలు ఆరా తీశారు. సదరు ప్రాంతంలో జరిగే సర్వేలో పూర్తి సమాచారం అందుబాటులో లేక, సర్వేలో నిర్లక్ష్యం వైఖరి కారణంగా సంబంధిత వార్డు ఎమినిటి సెక్రెటరీ కిరణ్మయికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఎస్‌ఇని ఆదేశించారు. సర్వే పారదర్శకంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే ప్రాంతంలో జిజిహెచ్‌ నుండి డిశ్చార్జ్‌ అయిన పకీర్‌గూడెం నివాసి 60 ఏళ్ల సయ్యద్‌ ముంతాజ్‌ గృహానికి వెళ్లి తాగునీటి క్లోరిన్‌ పరీక్షలు చేయించారు. తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. కేసులు నమోదైన ప్రాంతాలే కాకుండా రిజర్వాయర్‌ నుండి తాగునీటి సరఫరా జరిగే అన్ని గృహాల్లోనూ ఎమినిటీ సెక్రెటరీలు, ఎఎన్‌ఎంలతో డోర్‌ టు డోర్‌ సేర్వే నిర్వహిస్తున్నామన్నారు. తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళనకు గురికావద్దని, వాటర్‌ ట్యాంకర్ల ద్వారా వినియోగించే నీటిని కుడా కాచి చల్లార్చిన తరువాతే వినియోగించుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను (0863-2345103)ను వినియోగించుకోవాలని సూచించారు. పర్యటనలో కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాస్‌, షేక్‌ ఖాజా మొహిద్దిన్‌ చిస్టి, ఎస్‌ఇ సుందర్రామిరెడ్డి (ఇన్‌ఛార్జ్జి) పాల్గొన్నారు.

➡️