ఆదివాసీల జీవనం దుర్భరం

Mar 31,2024 21:08

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మారుమూల గిరిజన పల్లెల్లో ఆదివాసీలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు మారినా ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో మాత్రం వెలుగురేఖ నిండలేదు. నాటికీ నేటికీ ఆదివాసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగానే ఉంది. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అభివృద్ధి శూన్యం. ఉద్యోగం, ఉపాధి లేక వలస బాట పడుతున్న వారు ఎందరో. గిరిజనులకు వెన్నుముకగా ఉన్న ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాల కోసం రూపొందించిన జిఒ 3ను రద్దు చేశారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు పగడ్బందీగా అమలు కాకపోవడంతో అడవిపై హక్కు కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. గిరిజన చట్టాలు చట్టుబండలే…తరతరాల నుంచి అడవిని నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలకు ప్రభుత్వ పాలకుల విధానాలతో, కార్పొరేట్‌ శక్తులతో అడవిలో కూడా రక్షణ కరువైంది. ఆదివాసీల జాగృతి కోసం ఎన్నో చట్టాలు అమలు చేసినా చట్టుబండలుగానే మిగిలిపోయాయి. అమాయకులైన ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఆనాటి అల్లూరి సీతారామరాజు నుంచి మొన్న జరిగిన శ్రీకాకుళ రైతాంగ పోరాటం ఉద్యమం వరకు పోరాడి సాధించుకున్న గిరిజన హక్కులు, చట్టాలను నేటి పాలకులు స్వార్థ రాజకీయాల కోసం నిర్వీర్యం చేస్తున్నారు. 1/70, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం, ఎల్‌టిఆర్‌, ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు చేయడం లేదు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటిడిఎ, జిసిసిల పనితీరు అంతంత మాత్రమే. జిఒ 3 రద్దు, నాన్‌ షెడ్యూల్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ జాబితాలో చేర్చే ప్రక్రియ నేటి వరకు జరగలేదు.గిట్టుబాటు ధర లేని అటవీ ఉత్పత్తులుగిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులకు దళారుల బెడద వెంటాడడంతో సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్ట పోతున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట మండలాల్లో ఎక్కువ శాతం చింతచెట్లు, జీడి తోటలు ఉన్నాయి. గిరిజ నులకు ప్రధానమైన ఈ రెండు పంటలను ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వచ్చిన పంటను తక్కువ ధరకే దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. గిరిజన కళలు కనుమరుగుప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రోజు రోజుకు గిరిజన కళలు కనుమరుగవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో సవర, జాతపు, కొండదొర, గదబ గిరిజన తెగలు జీవనం సాగిస్తున్నాయి. వారు నేటికీ సాంప్రదాయ కళలు, ఆచారాలు పాటిస్తున్నారు. డప్పు, తుడుము, సన్నాయి వాయిద్య కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బాధ్యతతో పని చేస్తున్నారు. గిరిజన కళలు, సాంప్రదాయాలు ప్రతిభింబించేలా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్ల నుంచి కోరుతున్నా ఎటువంటి చర్యలు లేవు. ఎన్నికల సమయాల్లో గ్రామాలకు వస్తున్న ప్రజాప్రతినిధులారా గెలిచాకైనా తమ కష్టాలపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేయాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.సమస్యలతో సహజీవనంపార్వతీపురం మన్యం జిల్లా 3934 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది. 15 మండలాలు ఉన్నాయి. 483 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పార్వతీపురం, సాలూరు కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎ లు ఉన్నాయి. 2.65 లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారు. మారుమూల కొండల్లో ఆదివాసీలు వందలాది సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. నేటి వరకు గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఇక్కడ విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోని పరిస్థితి. అక్షరాస్యతకు దూరంగా అనారోగ్యంతో మరణాలకు దగ్గరగా జీవనం సాగిస్తున్నారు.

➡️