ఆది నుంచీ మంత్రి సిఫార్సులపై విముఖత

Feb 10,2024 21:40

ప్రజాశక్తి-సాలూరు: ఆయనో డిప్యూటీ సిఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి.. పార్వతీపురం మన్యం జిల్లాకు బాస్‌ ఆయనే.. జిల్లాలో ఆయన చెప్పిందే వేదంలా జరగాలి. ఆయన చేసిందే శాసనం కావాలి.. కానీ అలా జరగడం లేదు..ఆయన డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హోదాలో చేసిన సిఫార్సులు బుట్టదాఖలా అవుతున్నాయి. ఆయన మాటకు విలువ లేకుండా పోతోంది. జరిగిన తప్పుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖ రాసినా స్పందన లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పురుషుల క్రికెట్‌ విభాగంలో పాచిపెంట మండల జట్టు విజేతగా నిలిచింది. పార్వతీపురం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్‌ ఫైనల్‌ పోటీల్లో పార్వతీపురం జట్టుపై పాచిపెంట జట్టు గెలుపు సాధించింది. పాచిపెంట మండలం మన్యం జిల్లా లో వున్న మారుమూల గిరిజన మండలం. అలాంటి మండలం నుంచి క్రికెట్‌ క్రీడలో పాల్గొనడం,మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వెళ్లడమే గొప్ప విషయం. వెనుకబడిన మండలం నుంచి వచ్చిన క్రికెట్‌ జట్టు ఫైనల్‌ లో విజేత కావడం హర్షించదగ్గ పరిమాణం. జిల్లా స్థాయి లో విజేతగా నిలిచిన పాచిపెంట జట్టు రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు అర్హత సాధించింది. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ చేతుల మీదుగా షీల్డ్‌, ధ్రువపత్రాలను జట్టు సభ్యులు అందుకున్నారు. విశాఖలో జరుగబోయే రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు అర్హత సాధించిన పాచిపెంట జట్టును డిప్యూటీ సీఎం రాజన్నదొర అభినందించారు.ఇంతలో ఏం జరిగిందో కానీ పాచిపెంట జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించలేదని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఓడిపోయిన పార్వతీపురం జట్టునే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర సొంత నియోజకవర్గానికి చెందిన విజేత జట్టును కాదని ఓడిన జట్టును పంపించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. క్రికెట్‌కు జెంటిట్‌మెన్‌ క్రీడ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ క్రీడలో ఇంతవరకు గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు. గెలిచిన జట్టును అవమానకరంగా ఇంటికి పంపించేసి ఓడిపోయిన జట్టును రాష్ట్ర స్థాయి పోటీలకు సాగనంపడం ద్వారా మన్యం జిల్లా అధికారులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయింది. ఆది నుంచి మంత్రి సిఫార్సులపై విముఖత ఎమ్మెల్యే నుంచి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా రాజన్నదొర బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏనాడూ జిల్లా అధికారులను శాసించే పరిస్థితి కనిపించలేదు. మన్యం జిల్లా ఏర్పాటు నుంచి కలెక్టర్‌ గా వున్న నిశాంత్‌ కుమార్‌ రాజన్నదొర చేసిన సిఫార్సులేవీ అమలు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఇతర అధికారపార్టీ ఎమ్మెల్యేలు చేసిన సిఫార్సులకు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో రాజన్నదొర చేసిన సిఫార్సులు పట్టించుకున్న దాఖలాలు లేవని నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.గతంలో గిరిజన సంక్షేమ డిడి నియామకం లో కూడా మంత్రి రాజన్నదొర ఒకరికి సిఫార్సు చేస్తే జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మరో అధికారపార్టీ ఎమ్మెల్యే సిఫార్సుకు ప్రాధాన్యత ఇచ్చారు.నియోజకవర్గంలో సస్పెండైన ఒక పంచాయతీ కార్యదర్శిని తిరిగి నియమించాలని రాజన్నదొర సిఫార్సు చేస్తే నియామకానికి చాలా కాలం పట్టింది. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ డిఎంహెచ్‌ఒ నియామకం విషయంలో ఆయన చేసిన సిఫార్సు దాదాపు బుట్టదాఖలా అయిందని తెలుస్తోంది. తాజా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంత్రి రాజన్నదొర సొంత నియోజకవర్గానికి చెందిన క్రికెట్‌ జట్టునే గెలిచిన తరువాత అవమానకర రీతిలో ఇంటికి పంపించడం పై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలకు అర్హత సాధించిన పాచిపెంట జట్టును ఎఒ కుంటిసాకులు చూపించి సాగనంపడాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.ఫిర్యాదు పై స్పందన లేదు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మన్యం జిల్లా అధికారులు వ్యవహరించిన తీరుపై డిప్యూటీ సీఎం రాజన్నదొర రాష్ట్ర స్థాయి క్రీడాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో విజేతగా నిలిచిన పాచిపెంట జట్టు పై అనర్హత వేటు వేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాసినా ఇంతవరకు స్పందన లేదు. ఈ వ్యవహారం లో జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తో పాటు ఇతర అధికారులతో ఆయన మాట్లాడి జరిగిన పొరపాటు ని సరిదిద్దాలని కోరినా ఫలితం లేకపోయింది.

➡️