ఆశాలపై ప్రభుత్వ నిర్బంధం తగదు

పల్నాడు జిల్లా : ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గురువారం తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్ల యూనియన్‌ సమావేశాన్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలను గృహనిర్బంధం , అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆశా కార్యకర్తలను సైతం పోలీస్‌ స్టేషన్‌ తీసుకువెళ్లి కూర్చోబెట్టడం వాళ్లు రాకపోతే కుటుంబ సభ్యులు కూడా బెదిరించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడం చేతగాని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేసి ఉద్యమాలను అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం ఫిబ్రవరి 8 విజయవాడలో ధర్నా చేస్తామని ముందుగానే ప్రభుత్వానికి తెలియజేశామని ఈ నేపథ్యంలో చర్చలకు పిలిచి చర్చల అనంతరం యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మిని అరెస్టు చేసి ఏ స్టేషన్లో పెట్టింది కూడా తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశాల సమస్యలు పరిష్కారం కోసం యూనియన్‌ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో కార్యనిర్వహణ అధి కారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశాలు ఎం.ధనలక్ష్మి, పి రాజ్యలక్ష్మి, పి హేమలత, షేక్‌ జరేన, ఆర్‌ కనక రత్నం, రోషన్‌ బి , యామిని, రమాదేవి, సత్యవతి, వెంకటరమణ, పద్మావతి, లక్ష్మీ ,దుర్గ తదితరులు పాల్గొన్నారు.

➡️