ఆ మూడు బిజెపికి తొత్తు పార్టీలు : పిసిసి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి, టిడిపి, జనసేన ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిస పార్టీలని మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన రాజంపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ మూడు పార్టీలు బిజెపి చేతులు వీలుబొమ్మలుగా మారడం శోచనీయమన్నారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రత్యేక అభివద్ధి, ప్యాకేజీకి తిలోదకాలిచ్చిందని వ్యాఖ్యా నించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు స్వస్తి పలికిందని, దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసే లేదని, పోలవరం ప్రశ్నార్థకమైందని, విజయవాడకు మెట్రో రైలు రాలేదని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపికి ఎంత మాత్రం బలం లేదని, ఒక ఎమ్మెల్యే గానీ, ఎంపీగాని లేకుండానే పెత్తనం చెలాయిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిసలుగా మారడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్‌, మండల అధ్యక్షులు జనార్ధన, పట్టణ అధ్యక్షులు కనిశెట్టి నరేష్‌, శివ పాల్గొన్నారు.

➡️