ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠినత్వం

Feb 13,2024 23:31

మాట్లాడుతున్న ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ శ్రీనివాసరావు, వేదికపై జెఎసి నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపడుతున్న ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని ఏపీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం స్థానిక ఎన్‌జిఒ హోంలో జేఏసీ జిల్లా చైర్మన్‌ ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణపై జెఎసి సభ్య సంఘాలు చర్చించాయి. ఉద్యోగులకు రావలసిన బకాయిలు జి.పి.ఎఫ్‌, ఏ.పీ.జి.ఎల్‌.ఐ, సరెండర్‌ లీవ్‌, డి.ఎ, పిఆర్‌సి బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, 12వ పిఆర్‌సికి సంబంధించి తాత్కాలిక భతి మంజూరు చేయటం తదితర డిమాండ్లపై చర్చించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ యథావిధిగా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగ సంఘాలతో అనేకసార్లు మంత్రుల కమిటీ చర్చలు జరిపిందని, అనేకసార్లు వాయిదాల పద్ధతిలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఏదీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతుందని, పిల్లల స్కూలు, కాలేజీ ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితులలో ఉన్నారన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు చెల్లించవలసిన రూ.21వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెఎసి గుంటూరు జిల్లా కన్వీనర్‌ ఎస్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను తక్షణం క్రమబద్ధీకరించాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలని, వారిపై అజమాయిషి ఒక్క డిపార్ట్మెంట్‌కు మాత్రమే ఉండాలని, ఎఎన్‌ఎంలకు యాప్‌ల భారం తగ్గించాలని, డిమాండ్‌ చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ శాఖల సంఘ అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు హాజరై ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం ఉంటుందని, అప్పటివరకు అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేశౄరు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌, ఎస్టీయు నాయకులు పెదబాబు, ఎపిటిఎఫ్‌ 1938 నాయకులు వేళాంగిణిరాజు, ఎపిటిఎఫ్‌-257 నాయకులు బసవలింగారావు, వివిధ ఉద్యోగ సంఘ నాయకులు అగ్రికల్చర్‌ అసోసియేషన్‌ సురేష్‌, ఖజానా శాఖ ఆంజనేయులు, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నరసింహారెడ్డి పాల్గొన్నారు.

➡️