ఎండ సెగలు కక్కుతున్నా జాడలేని చలివేంద్రాలు

Apr 1,2024 23:06

రద్దీగా ఉండే కళామందిర్‌ సెంటర్‌
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
వేసవి నేపథ్యంలో రెండు వారాల నుండి ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల నుండే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాగునీరు ఎక్కువగా తాగాల్సిన ఈ సమయంలో మున్సిపాల్టీ తన బాధ్యతలను విస్మరించింది. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంతోపాటు ప్రధాన కూడళ్లలో ప్రతిఏటా మున్సిపాల్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ చర్యలేమీ లేవు. దీంతో గొంతు తడవాలంటే జేబు తడుముకోవాల్సి పరిస్థితి సామాన్యులకు దాపురించింది. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వివిధ రోజువారీ కూలి పనుల కోసం వేలాది మంది చిలకలూరిపేటకు వస్తుంటారు. రాకపోకల సందర్భంలో, బస్సుల కోసం నిరీక్షించే సమయంలో వీరికి దాహమేస్తే కూలిడబ్బులతో నీరు కొనుక్కోవాల్సి వస్తోంది. ఉదయం పూట పనులకు వెళ్లే సందర్భంలో ఛార్జీ డబ్బులతోనే వచ్చే కూలీలు నీరు కొనుక్కోవడానికి కొన్ని సందర్భాల్లో డబ్బుల్లేక గొంతు ఎండబెట్టుకుంటున్నారు. గతంలో గడియార స్తంభం, కళామందిర్‌ సెంటర్‌, ఎన్‌ఆర్‌టి సెంటర్‌ తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు పెట్టేవారు. బస్సులు ఎక్కిదిగడానికి కూడా ఇవే ప్రధాన కూడళ్లు కావడంతో ఎండల్లో నిరీక్షించే ఎక్కువ మందికి చలివేంద్రాలు గొంతు తడిపేవి. దీనిపై మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు సత్వరం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️