ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష

Feb 10,2024 21:21

 ప్రజాశక్తి-విజయనగరం  :  పోలింగ్‌, కౌంటింగ్‌ విధులు మినహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర బాధ్యతలు నిర్వర్తించే ఎన్నికల అధికారులందరికీ ఈ నెలాఖరులోగా అవసరమైన శిక్షణ పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌లకు సూచించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్‌లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణతో నేరుగా సంబంధం వున్న అధికారులు ఎవరైనా సోమవారం నాటికల్లా వారికి ఇచ్చిన పోస్టింగ్‌ల మేరకు చేరనట్లయితే తమకు తెలియజేయాలన్నారు. జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కమ్యూనికేషన్‌ ప్లాన్‌, రవాణా ప్లాన్‌, ఓటరు ఫోటోగుర్తింపు కార్డుల పంపిణీ, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అప్పీళ్ల పరిష్కారం, పోలింగ్‌ సిబ్బంది నియామకం, భద్రతా సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో చేసిన ఏర్పాట్లపై కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి వివరిస్తూ ఇప్పటికే పోలింగ్‌ అధికారుల వివరాలన్నీ ఎన్నికల వెబ్‌సైట్‌లో నమోదు చేశామని, మైక్రో అబ్జర్వర్ల సమాచారం కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని కేంద్రాల్లో నిర్మాణాలను వారం రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు. జిల్లాలో ఒక పోలింగ్‌ కేంద్రానికి కేవలం ద్విచక్ర వాహనం ద్వారా మాత్రమే చేరుకునేందుకు అవకాశం వుందని, అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఐదు పోలింగ్‌ కేంద్రాలకు మొబైల్‌ కనెక్టివిటీ లేదని, కమ్యూనికేషన్‌ ఏర్పాట్లపై టెలికాం అధికారులతో చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల అవసరాలకు 25 నుంచి 30శాతం మంది మాత్రమే భద్రతా సిబ్బంది అందుబాటులో వున్నారని, ఇతర యూనిఫాం సిబ్బంది సేవలను ఉప యోగించు కుంటామని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒలు సాయిశ్రీ, ఎంవి సూర్యకళ, ఎస్‌డిసిలు మురళీకృష్ణ, సుధారాణి, ప్రమీలా రాణి, సిపిఒ పి.బాలాజీ, హౌసింగ్‌ పీడీ శ్రీనివాస్‌, డిఎస్‌ఒ మదుసూధన్‌, జిల్లా ఆడిట్‌ అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️