‘ఎమ్మెల్యే అవినీతి రోజుకొకటి చొప్పున బయట పెడతా’

నరసరావుపేట: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి భూ ఆక్ర మణలపై తాను చేసిన ప్రతీ ఆరోపణకు ఆధా రాలు ఉన్నాయని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఎమ్మెల్యే భూ దందా పై స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎమ్మెల్యే భూ కుంభకోణం బయట పెడుతుండటంతో తనపై అనేక కేసులు పెట్టారని , ఎన్ని కుట్ర కేసులు పెట్టినా ,కుతంత్రాలు పన్నినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గోపిరెడ్డి అవినీతిని బయటపెట్టి గద్దె దించడమే తన అం తిమ లక్ష్యమన్నారు. ఉప్పలపాడు రోడ్డులో సాయి బాలాజీ వెంచర్‌ మాటున గోపిరెడ్డి బినామి కాజావలి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకున్నారని, ఈ 45 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎన్‌ఎస్‌పి నీటి భూములు ఆరు ఎకరాలు,బండ్ల దారి తొమ్మిది ఎకరాల 50 సెంట్లు, కుంట పోరంబోకు భూమి ఆరు ఎకరాలు, మిగులు భూమి 14 ఎకరాలు, కుమ్మరి, మంగలి,చాకలి ఇనాం భూములు 16 ఎకరాలు, సాయి బాలాజీ వెంచర్‌ లో ప్రభుత్వ భూమి ఉందని వాటికి సంబంధించిన ఆర్‌ హెచ్‌ కాఫీ,ఆర్‌ ఎస్‌ ఆర్‌ పత్రాలను చూపించారు. సాయి బాలాజీ వెంచర్‌ లో దేవదాయ భూములను కూడా ఎమ్మెల్యే అమ్ముకొని సొమ్ము చేసు కున్నారని ఆరోపించారు. సాయి బాలాజీ వెంచర్‌లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరం ఐదు కోట్ల చొప్పున అమ్ముకున్నారని ఆ భూమికి సంబం ధించిన సర్వే నంబర్లు 175 – 210ఎ ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాలేదని, తాను కబ్జా చేయలేదని చెబుతున్న ఎమ్మెల్యేకిి చిత్తశుద్ధి ఉంటే నరసరావుపేటలో ఉన్న ప్రభుత్వ భూముల పై విచారణ జరిపించి ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో చెప్పాలని అరవిందబాబు సవాల్‌ విసిరారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై నిజనిర్ధారణ కమిటీ వేసి కలెక్టర్‌, ఆర్డీవో, ఎమ్మార్వో,ప్రతిపక్ష నాయకులను కమిటీ సభ్యులుగా ఉంచి, విచారణకు జగన్‌ప్రభుత్వం నుంచి అనుమతిని ఎమ్మెల్యే మంజూరు చేయించగలరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అవినీతి,అక్రమాలు రోజుకు ఒకటి చొప్పున బయట పెడతానని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కడియం కోటి సుబ్బారావు,పట్టణ ప్రధాన కార్యదర్శి జి.శేఖర్‌,మైనార్టీ నాయకులు మీరావలి, మాబు,రఫీ,బీసీ నాయకులు పి.బసవేశ్వర రావు, కె.గంగాధర్‌ పాల్గొన్నారు.

➡️