ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలన్నీ ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేయాలని రాస్తారోకో

రాస్తారోకో నిర్వహిస్తున్న ఆదివాసీ యువత

ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలన్నీ ఆదివాసీ పట్టాభద్రులతోనే భర్తీ చేయాలని కోరుతూ భారత్‌ ఆదివాసీ పార్టీ, ఆదివాసీ జెఎసి ఆధ్వర్యాన సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్‌ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనరల్‌ డిఎస్సీ 2024లో ఉపాధ్యాయ ట్రైనింగ్‌ పొందిన ఆదివాసీ పట్టభద్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అందువల్ల ఆదివాసీ స్పెషల్‌ డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. జనరల్‌ డీఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రెంటిస్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఆదివాసి జేఏసీ జిల్లా నాయకులు వంతు బలకృష్ణ మాట్లాడుతూ జనరల్‌ డిఎస్సీ 2024లో సెలెక్ట్‌ అయిన గిరిజనేతర అభ్యర్థులను షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉపాధ్యాయ నియమకాలు చేపట్టరాదని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నెంబర్‌ 3పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆదివాసీల పట్ల చిత్త శుద్ధి ఉంటే షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐటిడిఎ ఎదుట ధర్నా నిర్వహించి, పిఓ సూరజ్‌ గనోరేకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుమ్మడి లోవ ప్రసాద్‌, గంటిమల్ల శ్రీనివాసరావు, రవితేజ, బీరబోయిన రామకృష్ణ, కంగల రామకృష్ణ, కంగల అబ్బాయి దొర, ఈకా శ్రీను, వీనిత, ఈకా రామకృష్ణ, కురసం వరలక్ష్మి, బొరగ ఎర్రమ్మ, శారపు నాగమణి, గోకిరి గంగరాజు, మద్దేటి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️