ఐదు చోట్ల తొలగని ప్రతిష్టంభన

Mar 1,2024 23:57

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పెదకూరపాడు, గురజాల, నర్సరావుపేట, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాలేదు. ఇక్కడ ఉన్న ఇన్‌ఛార్జిలకు భరోసా ఇవ్వకపోవడంతో వారంతా అయోమయంలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో విశేషమేమంటే పార్టీలో చేరకముందే కొంతమంది నాయకుల పేర్లను ఫోన్‌ సర్వేల్లో ఆరా తీస్తున్నారు. గురజాల నుంచి ఎమ్మెల్సీ జంగాకృష్ణమూర్తి పేరును సర్వేల్లో చేర్చారు. ఆయన ఇంత వరకు వైసిపికి రాజీనామా చేయలేదు.. టిడిపిలో చేరలేదు.. చంద్రబాబును కలసి చర్చించనూ లేదు. ఆయన తరుఫున ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు మాత్రమే అభ్యర్థించారు. గురజాల ఇన్‌ఛార్జిగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు పేరును నర్సరావుపేట నియోజకవర్గానికి మార్పు చేస్తూ సర్వే చేశారు. సీనియర్‌ నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్‌కు తొలి జాబితాలో చోటు దక్కలేదు. వీరికి ప్రాతినిధ్యం వుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పొత్తులో తెనాలిలో అవకాశం ఇవ్వకపోతే ఆలపాటికి ప్రత్యామ్నాయంగా మరొకచోట అవకాశం కల్పించే అంశంపై ఇంతవరకు స్పష్టత లేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల నుంచిపోటీ చేసే అంశాన్ని శనివారం దాచేపల్లిలో జరిగే రా కదలిరా సభలో చంద్రబాబు ప్రస్తావిస్తారా లేదా విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సరావుపేట సిట్టింగ్‌ ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు వైసిపికి రాజీనామా చేసి దాచేపల్లిలో చంద్రబాబు సమక్షంలో రా కదలిరా సభలో పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జంగా కృష్ణమూర్తి టిడిపిలో చేరడం లేదు. సీటు ఖరారు కాకపోవడంతో జంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జంగా దాచేపల్లి సభలో పాల్గొనకపోతే అనివార్యంగా యరపతినేని పేరును చంద్రబాబు ప్రకటిస్తారని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు. 1995 నుంచి పార్టీలో చురుగ్గా ఉన్న యరపతినేనికి మొదటి జాబితాలోనే పేరు ఉంటుందని భావించినా కొత్తగా చేరికల ప్రభావంతో ఇప్పటివరకు యరపతినేని పేరు ఖరారులో జాప్యం జరిగిందంటున్నారు.యరపతినేని గురజాలలో కొనసాగిస్తే నర్సరావుపేటలో చదలవాడ అరందబాబును కొనసాగించే అవకాశం ఉంది. గుంటూరు తూర్పు, పశ్చిమ సీట్లు బిజెపి,జనసేన పొత్తు పై స్పష్టత వచ్చిన తరువాతనే ప్రకటిస్తారని తెలిసింది.పెదకూరపాడులో మాత్రం రియల్టర్‌ భాష్యం ప్రవీణ్‌ పేరును పరిశీలిస్తున్నారు. అంటిపెట్టుకుని ఉన్న తమకే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వర్గీయులు పట్టుబడుతున్నారు. పెదకూరపాడు విషయంలో కూడా దాచేపల్లిసభలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. సీటు విషయంపై అస్పష్టత ఉన్నా దాచేపల్లిసభకు జనసమీకరణపై యరపతినేని శ్రీనివాసరావు దృష్టిసారించారు. శుక్రవారం పల్నాడు జిల్లా మొత్తం మీద జనసమీకరణపై ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో ఆయన చర్చించారు.

➡️