ఓటు వేయడం మన బాధ్యత : కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

  • ప్రజల భధ్రతకు బరోసా కల్పించేందుకే పోలీస్‌ కవాతు

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఓటు వేయడం మన బాధ్యతని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛంధంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుండి పోలీస్‌ సిబ్బంది, సాయుధదళాల సిబ్బందితో నిర్వహించిన ప్లాగ్‌ మార్చ్‌లో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్‌పి డి.మేరి ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ లావణ్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఓటర్లు నిర్బయంగా, నిస్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో పోలీస్‌, రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ఆధ్వర్యంలో చెక్‌ పోస్టులవద్ద స్టాటిక్‌ సర్వే లైన్స్‌ టీమ్స్‌(ఎస్‌ఎస్‌ టి), ప్లయింగ్‌ సర్వేలైన్స్‌ టీమ్‌ లు,(ఎఫ్‌ఎస్‌ టి) , వీడియో నిఘా బందాలు (విఎస్‌ టి) ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 8 వేల నుండి 10 వేల వరకు పోలీస్‌ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఇందులో కేంద్ర బలగాలు (సిఐఆర్‌ఎఫ్‌) 3 బందాలు జిల్లాకు కేటాయించడం జరిగిందని అందులో 2 బందాలు ప్రస్తుతం జిల్లా అంతటా ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు నగరంలో ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. బ్యానర్స్‌, ర్యాలీలు, పోస్టర్స్‌, పబ్లిసిటీ, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రకటనలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే రాజకీయపక్షాలకు అవగాహన పరిచామన్నారు. దీని నిమిత్తం ఎన్నికల కమీషన్‌ రూపొందించిన సువిధ యాప్‌ లో ధరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. ఎన్నికల కమీషన్‌ ఓటుకలిగిన ప్రతిఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కును వినియోగించుకోవడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని ఇందులో భాగంగా పోలీస్‌ శాఖ ద్వారా ప్లాగ్‌ మార్చ్‌ లు నిర్వహించి ప్రజలకు ఓటును నిర్బయంగా వేసుకోవడానికి మేమున్నామనే భరోసాతో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డి. మేరి ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు ను నిర్వహిస్తూ ప్రజలకు ధైర్యాన్ని మరియు భరోసాను కల్పిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడే లక్ష్యంగా కవాతు నిర్వహించడం ముఖ్యఉద్దేశ్యమన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ ఎన్‌ఎస్‌ కె. ఖాజావలి, ఏలూరు రిటర్నింగ్‌ అధికారి ఎం.ముక్కంటి, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్‌ వెంకటకృష్ణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భానుశ్రీ, డిఎస్పీ ఇ శ్రీనివాసులు, ఎస్‌.బి ఇన్స్పెక్టర్‌ మల్లేశ్వర రావు, సిఐలు రాజశేఖర్‌, ప్రభాకర్‌ రావు, వి. వెంకటేశ్వరరావు, అర్‌.ఐ పవన్‌ కుమార్‌, ఎస్‌ఐ లక్ష్మణ్‌ బాబు, సాదిక్‌, ప్రసాద్‌, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా. మాలతి, తదితరులు పాల్గొన్నారు.

➡️