కసరత్తు

Feb 10,2024 20:45 #కసరత్తు

ప్రజాశక్తి – కడప ప్రతినిధిమైలవరం పార్కు పునరుద్ధరణ కసరత్తు ఊపందుకుంది. ఐదేళ్ల కిందట చేనేత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించి 62.18 ఎకరాల విస్తీర్ణం కలిగిన పార్కులో తలపెట్టిన పలు అభివృద్ధి పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మూడు నెలల కిందట బదిలీపై వచ్చిన చేనేత జౌళీ శాఖ కలెక్టర్‌, కమిషనర్ల దృష్టికి మూలనపడిన పార్కు సమస్యను తీసుకెళ్లడంతో కదలిక వచ్చింది. కలెక్టర్‌, కమిషనర్ల ఆమోదం లభించిన అనంతరం రూ.1.14 కోట్లతో కూడిన పునరుద్ధరణకు ప్రతిపాదనలు అందజేసింది. ఎపిఇడబ్య్లుఐడిసి కన్‌స్ట్రక్షన్‌ విభాగానికి పునరుద్ధరణ పనుల్ని అప్పగించింది. రూ.50 లక్షలతో ఎపిఇడబ్య్లుఎస్‌ ఐడిసి విభాగం కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, హెల్త్‌సెంటర్‌, క్యాంటీన్‌, డ్రెయినేజీ వంటి సివిల్‌ పనులు, రూ.44 లక్షలతో విద్యుత్‌ సదుపాయం పునరుద్ధరణ పనుల్ని ఎపిఎస్‌పిడిసిఎల్‌, రూ.20 లక్షలతో తాగునీటి సదుపాయం పనుల్ని ఆర్‌డబ్య్లుఎస్‌ డిపార్టుమెంట్లకు అప్పగించింది. ఆయా విభాగాలు పార్కు పునరుద్ధరణ పనుల్ని వేగవంతం చేయడం గమనార్హం. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పునరుద్ధరణ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్కులోని 118 ప్లాట్ల కేటాయింపునకు చర్యలు తీసుకోనుంది. దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తులు చేసుకున్న 43 మంది ఆశావహులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలించిన అనంతరం లాటరీ పద్ధతిలో ప్లాట్లను అప్పగించనుంది. పార్కులో పవర్‌లూమ్‌ యూనిట్స్‌, పవర్‌లూమ్స్‌తోపాటు హ్యాండ్లూమ్‌ యూనిట్స్‌, డెయింగ్‌ యూనిట్స్‌, గార్మెంట్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక్కడి 118 యూనిట్లలో మూడు వేల మందికి ఉపాధి లభించనుంది. ఇక్కడ చేనేత కార్య కలాపాలు చేపట్టిన సంస్థలకు 15 శాతం రామెటీయల్‌ సబ్సిడీకి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రూపులకు చెందిన సభ్యుల పనితీరును ముగ్గురితో కూడిన అధికారుల కమిటీ పరిశీలన అనంతరం ఇండెంట్‌ ప్రకారం యార్న్‌ సబ్సిడీ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చేనేతజౌళీశాఖ ఎడి జి.నాగరాజారావును సంప్రదించగా మూల నపడిన మైలవరం పార్కు పనుల పునరుద్ధరణను వేగవంతం చేసిన మాట వాస్తవ మేనని, మూడు నెలల వ్యవధిలో పునరుద్ధరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో పట్టాలపైకి ఎక్కే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొనడం గమనార్హం.

➡️