కాంగ్రెస్‌ అభ్యర్థులుగా సామాన్యులు

Apr 2,2024 22:11

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థుల జాబితాను పిసిసి విడుదల చేసింది.ఇందులో భాగంగా విజయనగరం జిల్లా పరిధిలో నాలుగు, పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరంతా సామాన్యులు కావడం విశేషం. విజయనగరంలో సుంకరి సతీష్‌కుమార్‌, గజపతినగరం నుంచి గాదపు కూర్మినాయుడు, చీరుపుపల్లి నుంచి తుమ్మగంటి శ్రీనివాస నాయుడు, రాజాం నుంచి కంబాల రాజవర్థన్‌ బరిలోకి దిగనున్నారు. ఇంకా నెల్లిమర్ల, ఎస్‌.కోట, బొబ్బిలి నియోజకర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం అభ్యర్థిగా బత్తిన మోహనరావు, సాలూరు అభ్యర్థిగా మువ్వల పుష్పారావు, పాలకొండ అభ్యర్థిగా సరవ చంటిబాబు ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో అంతా సామాన్యులే. కొందరికి గ్రామ, మండల స్థాయిలో స్థానిక, సామాజిక సమస్యలపై పోరాడిన నేపథ్యం ఉంది. వీరిలో సతీష్‌కుమార్‌ విజయనగరంలోని మంగళ వీధికి చెందినవారు. డిసిసి మాజీ అధ్యక్షులు కీర్తిశేషులు యడ్ల ఆదిరాజుకు స్వయాన మేనల్లుడు. బిఎ పూర్తిచేసిన ఆయన చాలా ఏళ్లగా కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. చీపురుపల్లి అభ్యర్థి తుమ్మగంటి సూరినాయుడు గరివిడి మండలం గడ్డపువలసకు చెందినవారు. 2021లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తొలుత ప్రజారాజ్యంలో పార్టీ రాష్ట్ర మానిటరింగ్‌ కమిటీ సభ్యుడుగా, విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్‌గా పనిచేశారు. అనంతరం జనసేన, ఆ తరువాత వైసిపిలో చీపురుపల్లి ఇంఛార్జిగా పనిచేశారు. 2014లో వైసిపి ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించారు. రాజాం నియోజకవర్గం అభ్యర్థి కంబాల రాజవర్ధన్‌ పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, చిన్న మంగళాపురం గ్రామానికి చెందినవారు. తండ్రి కంబాల రాజరత్నం గతంలో పాలకొండ ఎమ్మెల్యేగా సేవలందించారు. విదేశాలలో కొన్నేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. 2018 నుంచి రాజాం నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌ పార్టీ తరపున పనిచేస్తున్నారు. గజపతినగరం అభ్యర్థి గాదపు కూర్మినాయుడు దత్తిరాజేరు మండలం గొభ్యాం గ్రామానికి చెందిన వారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న నేపథ్యం ఉంది. చాలా కాలంగా కాంగ్రెస్‌ అభిమానిగా ఉన్నారు. పార్వతీపురం అభ్యర్థి బత్తిన మోహన్‌రావు పాలకొండ ప్రాంతానికి చెందినవారు. తొలుత శ్రీకాకుళం జిల్లా యూత్‌ కాంగ్రెస్‌లో పనిచేశారు. వృత్తిరీత్యా న్యాయవాది. ఎస్‌సి, ఎస్‌టి మైనారిటీ సమస్యలపై పనిచేసిన నేపథ్యం ఉంది. 20ఏళ్లగా అఖిల భారత దళిత హక్కుల ఫోరం, రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి న్యాయవాదుల ఫోరం లో పని చేస్తున్నారు. పాలకొండ కాంగ్రెస్‌ అభ్యర్థి సవర చంటిబాబు సీతంపేట మండలం కుసిమి పంచాయతీ బంగారుగూడకు చెందినవారు. తండ్రి సవర తోటయ్య గతంలో కుసిమి పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఈ కుటుంబం తొలి నుంచీ కాంగ్రెస్‌తోనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత కూడా అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. సాలూరు అభ్యర్థి మువ్వల పుష్పారావు సాలూరు మండలం తుండ పంచాయతీ జగ్గుదొర వలసకు చెందిన గిరిజన యువకుడు. గిరిజన సమస్యలపై గత కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు. పోలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేశారు. షెడ్యూల్‌ గ్రామాల యువకులకు ఉద్యోగాల కోసం షెడ్యూల్‌ ధ్రువపత్రాలు మంజూరు చేయాలని జగ్గుదొరవలస కేంద్రంగా ఉద్యమం నిర్వహించారు.

➡️