కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని కడప పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస ్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర ఐదు పార్లమెంట్‌, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు వెల్లడించారు. మిగిలిన స్థానాలకు రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా బద్వేలు (ఎస్‌సి), రైల్వేకోడూరు (ఎస్‌సి), రాయచోటి, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కడప పార్లమెంట్‌కు వైఎస్‌.షర్మిల పేరును అధిష్టానం ప్రకటించింది. రాజంపేట పార్లమెంట్‌కు ఎవరి పేరును ప్రకటి ంచలేదు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, రాజంపేట అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బద్వేలు అసెంబ్లీకి ఎన్‌డి.విజయజ్యోతి పేరును అధిష్టానం ప్రకటించింది. ఆమె 2014లో టిడిపి తరఫున పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో టిడిపి టికెట్టు రాకపోవడంతో అప్పుడు ఇండి పెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు మూడు వేల ఓట్లు పొందారు. 2009లోనే కాంగ్రెస్‌ టికెట్‌కు పోటీ పడగా అప్పట్లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కమలమ్మకు టికెట్‌ ఇచ్చారు. మళ్లీ ఆమెకు కాంగ్రెస్‌ టికెట్‌ రావడం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకోడూరు అసెంబ్లీకి గోశాల దేవిని అధిష్టానం ప్రకటించింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. రాబోయే ఎన్నికలలో విజయం సాధించాలనే ధీమాతో ఆమె రెండోసారి ఎన్నికల బరిలోకి దిగారు. రాయచోటి అసెంబ్లీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకులు షేక్‌ అల్లాబకష్‌ పేరును పార్టీ ప్రకటించింది. 35 సంవత్సరాలుగా ఆయన పార్టీలోనే వివిధ రకాల పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా ఆయన పనిచేస్తున్నారు. తంబళ్లపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఎం.ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. మూడోసారి కూడా ఆయన అవకాశం కల్పించింది. పీలేరు అసెంబ్లీకి ప్రముఖ న్యాయవాది, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సోమశేఖర్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన కాంగ్రెస్‌ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి కూడా వ్యవహరించారు. మదనపల్లె అసెంబ్లీకి మల్లెల పవన్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. మల్లెల ఫౌండేషన్‌ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసిపి టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆయన టికెట్‌ దక్కలేదు. చివరకు ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కింది. (ప్రజాశక్తి-బద్వేలు/రైల్వేకోడూరు/మదనపల్లె/రాయచోటి/పీలేరు/తంబళ్లపల్లె)

➡️