కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే…

Apr 2,2024 23:24

బాపట్ల ఎంపీ అభ్యర్థి జెడి శీలం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ మస్తాన్‌వలి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఎఐసిసి మంగళవారం ప్రకటించింది. నర్సరావుపేట లోక్‌సభ నుంచి గర్నెపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌, బాపట్ల లోక్‌సభకు కేంద్ర మాజీ మంత్రి జె.డి.శీలం పోటీ చేసే అవకాశం కల్పించారు. గుంటూరు లోక్‌సభకు ఇంకా ఖరారు చేయలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తొలి జాబితాల్లో చోటు దక్కించుకున్న వారిలో పమిడి నాగేశ్వరరావు (పెదకూరపాడు), చిలక విజరుకుమార్‌ (తాడికొండ), జక్కా రవీంద్రనాథ్‌ (పొన్నూరు), బురగా సుబ్బారావు (వేమూరు), కొరివి వినరుకుమార్‌ (ప్రత్తిపాడు), షేక్‌ మస్తాన్‌వలి (గుంటూరు తూర్పు), మద్దుల రాధాకృష్ణ (చిలకలూరిపేట), షేక్‌ మహబూబ్‌ బాషా (నర్సరావుపేట), చెన్నా శ్రీనివాసరావు (వినుకొండ), తియ్యగూర యలమందరెడ ి్డ(గురజాల), వై.రామచంద్రారెడ్డి (మాచర్ల)కు కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్లు దక్కాయి. రేపల్లె, బాపట్ల, తెనాలి, సత్తెనపల్లి సీట్లను ప్రకటించాల్సి ఉంది. గుంటూరు లోక్‌సభ, మంగళగిరి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను ఇండియా బ్లాక్‌లోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించే విషయంపై చర్చలు జరుగతు న్నందున ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. వైసిపి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ముస్లిములు, క్రిస్టియన్లు ఎన్‌డిఎ వైపు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం వల్ల తమ పార్టీ వైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల 2019 కంటే కాంగ్రెస్‌కు ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ స్థాయి అంశాలతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా ఉండటం వల్ల గత ఆరు నెలల్లో కాంగ్రెస్‌కు కొంత ఉత్సాహం వచ్చింది. అంతేగాక కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని అంశాలు కూడా పేద వర్గాలను ఆకట్టుకుంటున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, తెలంగాణ, కర్నాటకలో అమలు చేసిన ఆరు సూత్రాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా ఇతర పార్టీలను కూడగట్టుకుని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ వామపక్షాలు, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న ఎన్‌డిఎ కూటమి, వైసిపి అభ్యర్థుల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేందుకు సన్నద్ధమవుతోంది.

➡️