కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అజెండా ప్రకటించాలి

Apr 2,2024 22:17

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, నగరపంచాయితీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అన్ని రాజకీయ పార్టీలు అజెండా ప్రకటించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేప్వరరావు కోరారు. మంగళవారం స్థానిక లయన్స్‌ క్లబ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో కార్మికులు – సవాళ్లు అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మున్సిపల్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తాయని, మున్సిపల్‌ కార్మికుల పర్మినెంట్‌ చేసేలా ప్రతిపాదనలను ఆయా పార్టీల అజెండాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ చట్టాలను నిర్వీర్యం చేసేలా ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. లేబర్‌ కోడ్‌, ఇతర కార్మిక చట్టాలతో మోడీ ప్రభుత్వం కార్మికులపై దాడులు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిలదీసే పరిస్థితిలో లేవని చెప్పారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్‌ పాలకవర్గాలు నిధులు లేక దయనీయ స్థితిలో ఉన్నాయని, కార్మికుల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితిలో ఉన్నారని తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు నూకరాజు మాట్లాడు తూ పోరాటం ద్వారానే కార్మికుల సమస్యల్ని పరిష్కరించుకోగలమన్నారు. హక్కులు, చట్టాలను కాపాడుకోగలమని చెప్పారు. ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ కమిటీ సభ్యులు పోలరాజు, పర్మినెంట్‌ కార్మికుల సంఘం నాయకులు వెంకట్రావు, బోగీసు, కూర్మారావు, మీడియా ఇంఛార్జి రవి పాల్గొన్నారు.

➡️