కార్పొరేటర్ల అర్జీలకు అధిక ప్రాధాన్యమివ్వాలి

Feb 10,2024 00:15

కార్పొరేటర్లతో మాట్లాడుతున్న కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు : కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని, వార్డుల వారీగా అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పూర్తి చేయాలని విభాగాధిపతులకు నగర కమిషనర్‌ కీర్తి చేకూరి సూచించారు. వార్డుల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై కార్పొరేటర్లతో కమిషనర్‌ తన ఛాంబర్‌లో శుక్రవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఇప్పటికే వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేటర్లు అందించిన అర్జీలు, వాటి పరిష్కారంపై నివేదికివ్వాలని ఆయా విభాగాదిపతులను ఆదేశించారు. వార్డుల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు కూడా కమిషనర్‌తో చర్చించడానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు చెప్పారు. మిగిలిన రోజుల్లో కూడా కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటామని, వాట్సప్‌లో సమస్యలు తెలిపినా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్దతిలో రికార్డ్‌ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామన్నారు.
అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అన్నారు. జిఎంసి కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో కమిషనర్‌ స్పెషల్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, పరిష్కారానికి ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించామని చెప్పారు. కాంట్రాక్టర్లు వర్క్‌ అగ్రిమెంట్‌ పొందిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని, పనులకు సంబంధించి బిల్లుల ఆన్‌లైన్‌ చేయడం, చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యలను ప్రతి శుక్రవారం జరిగే స్పెషల్‌ గ్రీవెన్స్‌లో చెప్పాలని అన్నారు. కొన్ని అభివృద్ధి పనులపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా పనులను ఇంజినీరింగ్‌ అధికారులు మరొకసారి పరిశీలించి నివేదికివ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు అందించిన ఆర్జీలను, ఫిర్యాదులను ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి సమస్యలు పరిష్కారం అయ్యాక తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలోనే ఆయా స్టేజీల ప్రకారం పనులను ఎంబుక్‌ను రికార్డ్‌ను ఎప్పటికప్పుడు చేయించాలని ఏ.ఈ.లను ఆదేశించామన్నారు. బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం లేకుండా అన్ని స్టేజీల్లో వేగంగా రికార్డ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఇని ఆదేశించారు.

➡️