కార్మికుల హక్కుల కోసం సిఐటియు అండగా పోరాటాలు

Feb 10,2024 21:29
ఫొటో: మాట్లాడుతున్న సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌

ఫొటో: మాట్లాడుతున్న సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌
కార్మికుల హక్కుల కోసం సిఐటియు అండగా పోరాటాలు
– విఒఎల సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : శ్రామిక వర్గంపై శ్రమ దోపిడీని నివారించవచ్చు.. అదే దృఢ విశ్వాసంతో సిఐటియు పని చేస్తుందని, అందులో భాగంగా విఒఎల సమస్యల కోసం సిఐటియు అండగా పోరాటాలు చేస్తుందని సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని చెర్లో రమణారెడ్డి భవన్‌, సిపిఎం కార్యాలయంలో నాలుగు మండలాల వెలుగు విఒఎలతో సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు జి వి శివప్రసాద్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలు 40రోజులు సమ్మె చేసి 11 డిమాండ్లలో పది డిమాండ్లు సాధించారని, అంగన్‌వాడీలు సిఐటియు యూనియన్‌ అనుబంధం సంఘంలో ఉండడం వల్ల సిఐటియు వాళ్ల సమస్యల కోసం అండగా ఉండి పోరాడి సాధించడం జరిగిందన్నారు. సిఐటియు దేశంలోనే బలమైన యూనియన్‌ అని కార్మికుల పక్షాన పోరాడి హక్కుల సాధించడంలో నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఆర్‌టిసి, ఎల్‌ఐసి, అంగన్‌వాడీ, ఆశా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యోగ సంఘాలు సిఐటియు యూనియన్‌ అనుబంధ సంఘంలో ఉంటూ అనేక ఉద్యమాలు చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారన్నారు. విఒఎలుకు సిఐటియు అండగా ఉంటుందని, సమస్యల కోసం సిఐటియు తరఫున అండగా ఉండి పోరాడుతామని పిలుపునిచ్చారు. ఎపి వెలుగు విఒఎల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ విఒఎలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు యూనియన్‌ సంఘంలో చేరడంతో సమస్యలు పరిష్కరించుకునేందుకు సిఐటియు మనకు అండగా ఉండి పోరాడుతుందన్నారు. అందుకు మీరంతా ఒక తాటిపైకి రావాలని, గతంలో రూ.10వేలు, ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు రూ.8వేలు ఇస్తుందని, ఆ జీతం కుటుంబ పోషణకు సరిపోతుందా అని ప్రశ్నించారు. రకరకాల స్కీములు పెట్టి పనిభారం పెట్టడం సరికాదన్నారు. విఒఎలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం చేజర్ల, అనంతసాగరం, కలువాయి, మర్రిపాడు మండలాల విఒఎలు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, కార్యదర్శి కొండమూరు హాజరత్తయ్య మాట్లాడుతూ (సిఐటియు) సెంట్రల్‌ ట్రేడ్‌ యూనియన్‌ భారతదేశంలో అనేక ఉద్యోగ సంఘాలతో కలిసి వారి డిమాండ్ల కోసం ఉద్యమాలు చేసి పోరాడిన యూనియన్‌ అని తెలియజేశారు. 2002లో కార్మిక మంత్రిత్వ శాఖ గణాకాల ప్రకారం సిఐటియులో దాదాపు 32,22,532మంది ప్రతినిధులు ఉన్నారన్నారు. ఉద్యోగుల ఆర్థిక, సామాజిక హక్కులపై నిరంతరం శ్రమిస్తుందని సూచించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు గుల్జార్‌ బేగం, అనంతసాగరం సిఐటియు కార్యదర్శి అన్వర్‌బాషా, మర్రిపాడు విఒఎ బిబాషా, చేజర్ల, కలువాయి, మర్రిపాడు, అనంతసాగరం మండలాల విఒఎలు పాల్గొన్నారు.

➡️