కిడ్నాపింగ్‌ గ్యాంగ్‌ అరెస్టు

Feb 10,2024 21:35

ప్రజాశక్తి-విజయనగరం కోట : నగరంలోఓని బాబామెట్టలో ఈనెల 6న కిడ్నాపింగ్‌కు పాల్పడిన సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేసి, వారి నుంచి కిడ్నాప్‌కు వినియోగించిన మోటారుసైకిలు, కారుతో పాటు తులమున్నర బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు తెలిపారు. శనివారం టూటౌన్‌పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావే శంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. నగరంలోని బొందెల గూడెంకు చెందిన జోగ శివ కిషోర్‌ … జమ్ము నారాయణరానికి చెందిన కటకోటి సతీష్‌ కుమార్‌ షాపును అద్దెకు తీసుకొని, తాగునీరు సరఫరా చేసే వ్యాపారం నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడడంతో శివకిషోర్‌ వద్ద నుంచి రూ.7లక్షలు అప్పుగా సతీష్‌కుమార్‌ తీసుకున్నాడు. సకా లంలో అప్పు చెల్లించకపోవడంతో జోగ శివ కిషోర్‌ కోర్టులో సతీష్‌కుమార్‌పై కేసు వేశాడు. ఈ ఆర్థిక విషయాలపై ఇరువురి మధ్య గొడవలు జరగడంతో జోగ కిశోర్‌ తన వ్యాపారాన్ని బాబామెట్టకు మార్చేశాడు. దీంతో ఆగ్రహించిన సతీష్‌కుమార్‌ శివకిషోర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు అతని స్నేహితుడైన భీమిలికి చెందిన చుక్కా నూతన్‌సాయి కుమార్‌ను ఆశ్రయించగా, అతనికి ఈ తరహా దందాలకు పాల్పడే భీమిలికి చెందిన బంగారి గణేష్‌ను సాయంగా తీసుకున్నారు. ఈ సఫారి గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేసేందుకు రూ. 7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం ఈనెల 6న బాబామెట్టకు గ్యాంగు సభ్యులు చేరుకున్నారు. శివ కిషోర్‌ వాటర్‌ సరఫరా చేసేందుకు వ్యానులో బయలుదేరు తుండగా భీమిలికి చెందిన సురగల వరలక్ష్మి, మరో ఇద్దరు మోటారు సైకిల్‌పై వచ్చి వ్యానుకు అడ్డంగా పడిపోయినట్లుగా నటించగా, నిందితులు కారులో వచ్చి శివకిషోర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని, పూసపాటిరేగ మైలాన్‌ కంపెనీ వైపు తీసుకొని వెళ్లిపోయారు. అక్కడ కత్తితో బెదిరి ంచి, 15 ఖాళీ ప్రామిసరీ నోట్లపైనా, తెల్లకాగితాలపైనా, ఆధార్‌కార్డు జిరాక్సుపై సంతకాలు తీసుకొని, అనంతరం విచిక్షణా రహితంగా కొట్టారు. అతని నుంచి తులమున్నర చైను, రెండు ఉంగరాలను కూడా బలవంతంగా తీసుకొని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నిందితుల్లో ఒకడైన బంగారి గణేష్‌పై రౌడీ షీటు ఉంది. నిందితులందరూ ఒక ముఠాగా ఏర్పడి, ఈ కిడ్నాప్‌కు యత్నించారు. బంగారు వస్తువులను భీమిలి ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదవ పెట్టినట్లు, కారును ఒక్క రోజుకు అద్దెకు తీసుకొన్నట్లు విచారణలో అంగీకరించారు. ఎస్‌పి ఆదేశాలతో 2వ పట్టణ సిఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎన్‌ఐలు ఐ. దుర్గా ప్రసాద్‌, రాజేష్‌, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, కిడ్నాప్‌ కేసు మిస్టరీని చేధించారని డిఎస్‌పి తెలిపారు. సమావేశంలో 2వ పట్టణ సిఐ కోరాడ రామారావు, ఎస్‌ఐలు దుర్గా ప్రసాద్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️